చింతలపూడి: అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్టు పేరుతో రిలయన్స్ సంస్థ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూడటం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మండిపడ్డారు. వెంకటాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రైతులు, స్థానిక ప్రజలు భారీ నిరసన చేపట్టారు. అనంతరం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రిలయన్స్‌కు మా భూములు ఇవ్వం – మా భూమి, మా హక్కు‘ అంటూ రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సదస్సులో కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, రిలయన్స్ బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి కోసం ఈ ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాలు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. రైతులతో చర్చించకుండా, వారి ఆమోదం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని నిలదీశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి విధ్వంసం జరుగుతుందని మాజీ జెడ్పీటీసీ సీహెచ్ ఖాదర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మొక్కజొన్న, వరి తదితర ఉద్యాన, ఆహార పంటలు నాశనమై తీవ్ర ఉపాధి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పర్యావరణ విపత్తులు, భూగర్భ జలాల కాలుష్యం వంటి తీవ్ర నష్టాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పి.పాండురంగారావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్‌వీఎస్ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. వెంకట్రావు, రైతులు మధుబాబు, వై.సాయి, ఫణీంద్ర, ఊసా సుబ్బారావు, మాదాసు శ్రీనివాసరావు, బి. కోటేశ్వరరావు, హరికృష్ణ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఓ ద్విచక్ర వాహనంలోకి పాము దూరి కలకలం రేపింది. గమనించిన వాహనదారుడు భయంతో బండిని పక్కన నిలిపి, పామును బయటకు పంపేందుకు ప్రయత్నించాడు. అయితే, పాము బండి లోపలి భాగానికి మరింత లోతుగా వెళ్లిపోవడంతో ఎంతకీ బయటకు రాలేదు. దీంతో వాహనదారుడు స్నేక్ సేవియర్ సొసైటీ ప్రతినిధి క్రాంతికి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న క్రాంతి చాకచక్యంగా ద్విచక్ర వాహనంలో ఉన్న పామును సురక్షితంగా బయటకు తీశాడు. అనంతరం దానిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో వాహనదారుడు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


