● స్వర్ణ శేషవాహనంపై నారసింహుడికి కోవెల ఉత్సవం
● వేడుకల్లో నరసింహ గురూజీతో పాటు పాల్గొన్న సినీ దర్శకుడు త్రివిక్రమ్
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు మంగళవారం పవిత్రారోహణ వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ యాగశాలలో ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మండప పూజలు, నిత్య హోమాలు, బలిహరణ, మూలవరులకు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణ శేష వాహనంపై ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం దివ్య పవిత్రాలతో ఆలయం చుట్టూ కొవెల ప్రదక్షిణలు చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్, ఉత్సవ మూర్తులపై దివ్య పవిత్రాలను వేసి పవిత్రారోహణ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం మండప పూజలు, నిత్య హోమములు, మూలమంత్ర హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం జరిగే పవిత్రావరోహణతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.


