టి.నరసాపురం: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో చిన్నగురవాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ మూడో తరగతి విద్యార్థిని గుడికందుల చిరన్వి ద్వితీయ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి. కన్నయ్య తెలిపారు. ఈ నెల 4వ తేదీన గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని డి.పాల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘వి కింగ్స్ చెస్ అకాడమీ’ నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026’ పోటీల్లో చిరన్వి ఈ ప్రతిభ కనబరిచింది. అండర్–7 బాలికల విభాగంలో ఆడిన 7 గేములకు గాను 4 పాయింట్లు సాధించి ఆమె రెండో స్థానంలో నిలిచింది. విజేతగా నిలిచిన విద్యార్థినికి నిర్వాహకులు ప్రశంసాపత్రం, మెమొంటోతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థినిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. విజయమణి, ఎం. మోహినికుమారి, జి. శ్రీదేవి, ఎస్. రవికుమార్, విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


