స్థానిక సమరానికి సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి సన్నద్ధం

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

నేనూ కార్యకర్తనే..

ఏలూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయబావుటా లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. స్థానిక ఏ1 కన్వెన్షన్‌లో సోమవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘టీడీపీ వెన్ను పోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ అనే బ్రోచర్‌ను ఆవిష్కరించారు. మాజీ సీఎం జగన్‌ పాలనలో సంక్షేమ పథకాలు, లబ్ధిదారులతో కూడిన వివరాలతో ముద్రించిన బ్రోచర్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ప్రజా సమస్యలపై పోరాటాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, గెలుపునకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించాలని తీర్మానించారు.

ప్రజలతో మమేకం కావాలి

పార్టీ శ్రేణులంతా ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకోని పరిష్కారానికి కృషిచేయాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ అన్నారు. సమష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతూ అభ్యర్థుల విజయానికి నిబద్ధతతో పనిచేయాలని కోరారు. కూటమి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలతో కలిసి పోరుబాట పట్టాలన్నారు. భవిష్యత్‌ అంతా కార్యకర్తలదేనని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు.

టీడీపీది అరాచక పాలన

నేడు రాష్ట్రంలో టీడీపీ పాలన చూస్తుంటే దేశంలోనే ఉన్నామా.. పక్క దేశంలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుందనీ నూజివీడు మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు అన్నారు. కూటమి పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారనీ, పార్టీ శ్రేణులు అండగా నిలవాలన్నారు.

అన్నివర్గాల్లో అసంతృప్తి

పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు అండగా ఉంటూ వారి పక్షాన ఉద్యమించాలన్నారు.

డీఎస్సీలో అక్రమాలు

పోలవరం మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త తెల్లం బాలరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనీ, ఉద్యోగాల నియామకాల పేరుతో స్కాములు చేస్తోందని విమర్శించారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో విద్యామంత్రిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయనీ, సీబీఐ విచారణకు వెళ్లే దమ్ములేక, వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజల తరఫున పోరాటం

చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ పాలనలో సచి వాలయ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగిందని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ప్రజలతో ఉంటూ పోరాటం చేయాల్సిన సమయం అసన్నమైందన్నారు.

సమన్వయంతో విజయం

ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ నేతలు బీసీలపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారనీ, టీడీపీ కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీలోని బీసీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.

దెందులూరు నేత కొఠారు రామచంద్రరావు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు నూకపెయ్యి సుధీర్‌బాబు (కై కలూరు), డీవీఆర్‌కే చౌదరి (ఏలూరు), దాసరి రమేష్‌ (చింతలపూడి), కనుమూరి శివాజీ (పోలవరం), వాసంశెట్టి గంగాధర్‌ (నూజివీడు), సుబ్బరాజు (ఉంగుటూరు), నాయకులు తుమరాడ స్రవంతి, కోమటి విష్ణువర్థన్‌, శెట్టి రాజా, ముంగర సంజయ్‌కుమార్‌, మంతెన సోమరాజు, అంబికా రాజా, పల్లగాని నరసింహారావు, ఆళ్ల సతీష్‌చౌదరి, సయ్యద్‌ బాజీ, కామిరెడ్డి నాని, వాసిరెడ్డి మధు, నెరుసు చిరంజీవి, గేదెల సూర్యప్రకాష్‌, తేరా ఆనంద్‌, చిక్కాల దుర్గాప్రసాద్‌, భోగిశెట్టి పార్వతి, పల్లి శ్రీనివాస్‌, పి.రాజేష్‌, స్టాన్లీబాబు, భాస్కర్ల బాచి, సాయిల స్వాతి, చిలకపాటి డింపుల్‌, జిజ్జువరపు విజయనిర్మల, చప్పిడి వెంకన్న, కిలాడి దుర్గారావు, ఇనపనూరి జగదీష్‌, కంచుమర్తి తులసీ, తులసీ వర్మ, కుమారి, మోటమర్రి సదానంద కుమార్‌, బండ్లమూడి సునీల్‌, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్యనేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

తానూ పార్టీలో ఒక కార్యకర్తనేననీ.. స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పోరాటం చేస్తే విజయం తధ్యమని జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌ అన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేవరకూ అలుపెరుగని పోరాటం చేయాలన్నారు. నేతలంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, టీడీపీ పాలనపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని డీఎన్నార్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement