ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ఆన్‌లైన్ చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రెడ్డిదొర ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు జిల్లాపరిషత్ ఉప కార్యనిర్వహణ అధికారి కె.భీమేశ్వర్‌ను కలిసి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా రెడ్డిదొర మాట్లాడుతూ రెండేళ్లుగా జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్ చేయకపోవడం వలన ఖాతాదారుల అకౌంట్‌లో ఎంత సొమ్ము ఉందో తెలియడం లేదన్నారు. దీంతో ఉప కార్యనిర్వహణ అధికారి సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరలోనే ఖాతాలను ఆన్‌లైన్ చేయిస్తానని తెలిపారన్నారు. అలాగే ఫైనల్ పేమెంట్లు, లోన్ల ప్రక్రియను కూడా తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామారావు, కార్యదర్శి యూవీ నరసింహారాజు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు పి.జగదీష్, జంగారెడ్డిగూడెం మండల శాఖ అధ్యక్షుడు ఐ.వెంకటరత్నం, సీనియర్ నాయకులు కె.నాగేశ్వరరావు, ఎస్.రమేష్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాస్థాయిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ప్యాఫ్టో సెక్రటరీ జనరల్ యం.ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఏలూరు జిల్లా ప్యాఫ్టో చైర్మన్ జి.మోహన్ మాట్లాడుతూ రావికంపాడు హైస్కూల్ హెడ్మాస్టార్‌పై జరిగిన దాడికి విద్యాశాఖ తరపున తగిన న్యాయం జరగనందున ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి పాఠశాలలోనూ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా, ఒకవైపు సత్కారాలు నిర్వహించడం సరైన సందేశాన్ని ఇవ్వదని, ముందుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, వారి గౌరవానికి, ఆత్మాభిమానానికి భంగం కలగకుండా భద్రత, భరోసా కల్పించినప్పుడే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు నిజమైన అర్థం ఉంటుందన్నారు. కో–చైర్మన్ జి.వెంకటే శ్వరరావు, జె.రవీంద్ర, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఐ.రమేష్, టి.రామారావు, కార్యవర్గ స భ్యులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: జిల్లాలోని పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణను ప్రతి శుక్రవారం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివిజన్‌లో పోలీసులకు శిక్షణ, పరేడ్, సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు సబ్‌డివిజన్‌కు సంబంధించి ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆదేశాలతో వన్‌టౌన్ సీఐ కె.రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎస్‌ఐలు సుధాకర్, రామకృష్ణ, వి.వెంకటేశ్వరరావు ఉన్నారు. ఏలూరు లోని ఆంధ్రా హాస్పిటల్స్ కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ప్రత్యేకంగా సీపీఆర్‌పై శిక్షణ అందించారు. అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటుకు గురైన వ్యక్తికి వైద్య సాయం అందించేలోపు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సీపీఆర్ నిర్వహించే విధానం, ప్రాణాలను రక్షించటంలో సీపీఆర్ ప్రాధాన్యతను వివరించారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో భా గంగా రోడ్డు ప్రమాదాలు, ఆకస్మికంగా గుండెపోటు ఇతర అత్యవసర స్థితిలో ప్రజలకు స త్వర సహాయం అందించే అంశాలపై వివరించారు. ప్రజలకు మరింత మెరుగైన సహాయం అందించటమే లక్ష్యంగా ఈ ప్రత్యేక శిక్షణను అందిస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
నరసాపురం రూరల్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మండలంలోని కొప్పర్రు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ ఉపాధ్యాయురాలు రాజశ్రీ ఎంపికయ్యారు. శనివారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో తాను సీఎం చంద్రబాబు చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్టు ఆమె తెలిపారు. పలువురు ఆమెను అభినందించారు.


