● అవార్డుకు దరఖాస్తు చేసుకోని అర్హులు
● ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించిన టీచర్ సంఘాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల ప్రతిభకు కొలమానంగా నిలిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయులు అనాసక్తి కనబరిచారు. 60 అవార్డులకు గాను కేవలం 33 మందే దరఖాస్తు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అనాసక్తికి ప్రధాన కారణాలు
● ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడాన్ని ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నా, తమిళనాడు తరహాలో అసెంబ్లీలో రద్దు తీర్మానం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించకపోవడంపై అసంతృప్తి నెలకొంది.
● జిల్లాలో ఉపాధ్యాయులపై వరుస దాడులు జరుగుతుండటం, ముఖ్యంగా రావికంపాడు ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన దాడి ఉపాధ్యాయులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వం, విద్యా శాఖ వ్యవహారశైలిపై నిరసనగా వారు ఈ అవార్డులను బహిష్కరించినట్టు తెలుస్తోంది.
33 మంది ఎంపిక : దరఖాస్తు చేసుకున్న 33 మందిని విద్యాశాఖ అధికారులు పరిశీలించి తుది జాబితాను ప్రకటించారు. వీరిలో 30 మంది (12 మంది స్కూల్ అసిస్టెంట్లు, 18 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు) ఉన్నారు. మరో ముగ్గురు స్కౌట్ టీచర్లకు కూడా అవార్డులు ప్రకటించారు.
ఉపాధ్యాయ దినోత్సవం బహిష్కరణ
శనివారం ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల నిరసన సెగ తగిలింది. ఫ్యాప్టో సభ్య సంఘాలైన పలు ఉపాధ్యాయ సంఘాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని శుక్రవారం ప్రకటించాయి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోబోమని, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో తమ నిరసన ఉంటుందని ఆయా సంఘాల నాయకులు ప్రకటించారు.


