వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
నూజివీడు: మేకా వెంకట ప్రతాప్ అప్పారావును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడం దుర్మార్గమని, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎమ్మార్ అప్పారావు కాలనీకి సంబంధించిన ఆర్చిపై మంత్రి కొలుసు పార్థసారథి పేరు ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పేర్కొన్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును అరెస్టు చేశారన్న సమాచారం తెలుసుకొని వెంటనే నూజివీడుకు వచ్చి ప్రతాప్ అప్పారావును కలిసి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో క్రెడిట్ చోరీ పిచ్చి పతాకస్థాయికి చేరిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా కొత్తగా పది ఎకరాలు కొని పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చి కాలనీని నిర్మాణం చేసి అక్కడ మంత్రి పేరు పెట్టుకుంటే జనం హర్షిస్తారన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కాలనీకి మంత్రి సౌజన్యం అని పేరు పెడుతుంటే అది ఎంతమాత్రం కరెక్టు కాదని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల కూటమి పాలకులను ప్రజలంతా అసహ్యించుకుంటారన్నా రు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో సహనంతో ఉన్నారని డీఎన్నార్ అన్నారు.


