ద్వారకాతిరుమల: చినవెంకన్న దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చిలకపాటి వెంకట కోదండరామాచార్యులు శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని తిమ్మాపురం పంచాయతీ లక్ష్మీపురం నుంచి స్కూటీపై ద్వారకాతిరుమలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీపురం జగన్నాధస్వామి ఆలయ సమీపంలోని డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా భీమడోలు వైపు నుంచి ద్వారకాతిరుమలకు వెళుతున్న బైక్ ఆయన స్కూటీని ఢీకొట్టింది. దీంతో కోదండ రామాచార్యులు రోడ్డుపై పడిపోగా తలకు బలమైన గాయమైంది. స్థానికులు అందించిన సమాచారంతో వెంటనే స్పందించిన ఆలయ అధికారులు దేవస్థానం అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


