భీమవరం: యువత విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రీడా దినోత్సవ ర్యాలీని డీఎన్నార్ కళాశాల క్రీడా మైదానం వద్ద ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమ నిర్వాహకుడు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ.. మేజర్ ధ్యాన్‌చంద్ మిలటరీలో పనిచేస్తూనే హాకీ పట్ల ఉన్న ఆసక్తితో ఆ క్రీడలోకి ప్రవేశించి, భారతదేశానికే హాకీ పితామహుడిగా పేరుగాంచారని కొనియాడారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత మూడు రోజులుగా పట్టణంలోని 12 పాఠశాలలు, 3 కళాశాలల్లో హాకీ, క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, చదరంగం, క్యారమ్స్ వంటి పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేసినట్లు వెల్లడించారు. అనంతరం హాకీ కోచ్‌లు అప్పారావు, శేఖర్ రాజులతో పాటు పలువురు క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామభద్రిరాజు, మురళీధర్, దాల్‌నాయుడు, అచ్యుత్ బాబు తదితరులు పాల్గొన్నారు.


