భక్తులతో కిటకిటలాడిన ద్వారకాతిరుమల | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిటకిటలాడిన ద్వారకాతిరుమల

Aug 30 2026 1:09 AM | Updated on Aug 30 2026 1:09 AM

భక్తులతో కిటకిటలాడిన ద్వారకాతిరుమల 15 కేజీల కాపర్‌ వైరు చోరీ దాడి ఘటనపై కేసు నమోదు రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయం శనివారం భక్తజనులతో కళకళలాడింది. చినవెంకన్నకు ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దీంతో దర్శన క్యూలైన్లు, ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత దద్దోజన ప్రసాదం, బిస్కెట్లను పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

పెదవేగి: మండలంలోని భోగాపురం వ్యవసాయ పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం చేసి కాపర్‌ వైర్‌ చోరీ చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిగోపాల్‌ తెలిపారు. ఈ నెల 25న గుర్తుతెలియని వ్యక్తులు పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం చేసి 15 కేజీల కాపర్‌ వైరు చోరీ చేశారని రైతు కే నరేంద్రబాబు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు.

నూజివీడు: తుక్కులూరుకు చెందిన చలమాటి నరేష్‌ తమ ఇంటికి వచ్చి తన భర్త బడిపాటి ఆకాష్‌పై దాడి చేసి కొడుతుండగా, అడ్డు వెళ్లిన తమపై కూడా దాడి చేశాడని అదే గ్రామానికి చెందిన దిరిశనపు అనూష, ఆమె అక్క దిరిశనపు ఉమా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కులూరుకు చెందిన దిరిశనపు కోటేశ్వరమ్మకు, అదే గ్రామానికి చెందిన చలపాటి ఝాన్సీరాణికి మధ్య ఈ నెల 26న గొడవ జరిగి, ఒకరికొకరు తిట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కుల పెద్దలు ఇరువర్గాలను పంచాయతీకి పిలవగా.. అదే రోజు రాత్రి 9 గంటలకు కోటేశ్వరమ్మతో పాటు ఆమె కుమార్తె (తొమ్మిది నెలల గర్భిణి) అనూష, ఈమె అక్క ఉమా, అనూష భర్త ఆకాష్‌ పంచాయతీకి వెళ్లారు. అక్కడ చలపాటి నరేష్‌ అనే వ్యక్తి ఆకాష్‌పై దాడి చేయడానికి యత్నించగా, అతడిని వారించి ఆకాష్‌ను ఇంటికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నరేష్‌ వారి ఇంటికి వెళ్లి మళ్లీ ఆకాష్‌పై దాడికి ప్రయత్నించగా, అడ్డుగా వెళ్లిన అనూష, ఉమాలపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితురాళ్లు ఇద్దరూ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొయ్యలగూడెం: వై జంక్షన్‌ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. శనివారం జంగారెడ్డిగూడెం వైపు నుంచి వై జంక్షన్‌ వద్ద ఉన్న కల్యాణ మండపానికి వస్తున్న కారు.. గోపాలపురం మండలం నందిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్ర గాయాలపాలవడంతో పాటు కాలు విరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా బైక్‌ను ఢీకొన్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్షతగాత్రుడిని బంధువులు ఆటోలో లేదా వాహనంలో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్సై వి. చంద్రశేఖర్‌ తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తేలప్రోలు గూడ్స్‌ యార్డు సమీపంలో గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కీమ్యాన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా... తేలప్రోలు రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ అందించిన సమాచారంతో ఏలూరు జీఆర్‌పీ ఎస్సై వైకే దానం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విజయనగరం జిల్లా సింగరాయి గ్రామానికి చెందిన వాసాది స్వామి (26) అనే వ్యక్తి శనివారం తెల్లవారుజామున విశాఖపట్నం వెళుతూ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుడు ఐదు అడుగుల ఎత్తు, చామన చాయ రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్సై వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement