కూటమిలో కుమ్ములాటల జోరు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుమ్ములాటల జోరు

Aug 30 2026 1:09 AM | Updated on Aug 30 2026 1:09 AM

భీమవరంలో టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ

తాజాగా వీరవాసరం మండలంలో టీడీపీ, జనసేన మధ్య వివాదం

భీమవరం: కూటమి నాయకుల్లో కుమ్ములాటలు ఎక్కడా తగ్గేదే లేదనే విధంగా పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి పనులు కుంటుపడడమేగాక, ఘర్షణలకు దారితీస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. భీమవరం నియోజకవర్గం, వీరవాసరం మండలం చింతలకోటిగరువు గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విచారణకు వచ్చిన తరుణంలో టీడీపీ మండలాధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాసరావు, జనసేన నాయకుడు యిర్రింకి మాధవ పురుషోత్తమరావు (మాధవ్‌), వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ కొమ్మన శ్రీనివాసరావు, మరికొందరిపై దౌర్జన్యానికి దిగడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు

చింతలకోటిగరువు గ్రామంలో ఇటీవల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పంట బోదెల తవ్వకం పనులు నిర్వహించారు. బోదెలు సక్రమంగా తవ్వకుండానే దాదాపు రూ. 70 వేల నిధులు దుర్వినియోగం చేశారంటూ కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఎంపీడీవో తదితరులకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ విచారణ జరుపుతుండగా, టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు జనసేన, వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యానికి దిగారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఆయన్ను అడ్డుకుని నివారించారు.

ఆ వ్యాఖ్యలతో దుమారం

కొల్లేపర శ్రీనివాసరావు ఇటీవల భీమవరంలో టీడీపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై రాజకీయ పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులంతా ఆందోళనలు చేపట్టగా, ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్‌తో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో వీరవాసరం మండలంలోని ఆక్వా రైతులంతా సమావేశమై శ్రీనివాసరావు చర్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు ఆందోళనలు చేయగా, అందులో భాగంగా వీరవాసరంలోనూ రైతు పక్షాన ఫీడ్‌ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే టీడీపీకి, కొల్లేపరకు వచ్చిన నష్టమేమిటని రైతులు ప్రశ్నించారు. ఆనాటి సమావేశంలో కొల్లేపర బంధువులు సర్దిచెప్పడంతో అప్పటి వివాదం సద్దుమణిగింది. అయితే, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల్లో అవకతవకలపై ప్రశ్నిస్తే ఎందుకు కంగారుపడుతున్నారని, కూటమిలో భాగమైన జనసేన నాయకులపై దౌర్జన్యానికి దిగడం వెనుక ఆంతర్యమేమిటని జనసేన నాయకులు నిలదీస్తున్నారు. కొల్లేపర తీరు ఇలాగే ఉంటే వీరవాసరం మండలంలో కూటమికి ఇబ్బందులు తప్పవని ఆయా పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement