యువతిని ట్రాప్‌ చేసి.. వీడియోలు రికార్డు చేసి | - | Sakshi
Sakshi News home page

యువతిని ట్రాప్‌ చేసి.. వీడియోలు రికార్డు చేసి

Aug 30 2026 1:09 AM | Updated on Aug 30 2026 1:09 AM

నూజివీడు: లూడో ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమయ్యాడు.. ఆపై ప్రేమ అన్నాడు.. అనంతరం మాయమాటలు చెప్పి న్యూడ్‌ కాల్స్‌ చేయించి రికార్డు చేశాడు. ఇప్పుడు వాటిని బంధుమిత్రులకు పంపి యువతిని బెదిరిస్తున్నాడు. నిందితుడిని పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడుకు చెందిన యువతి(27)కి లూడో ఆన్‌లైన్‌ గేమ్‌లో మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన వేముల్‌ రోహన్‌ వైకుంఠం(31)తో పరిచయం ఏర్పడింది. రోహన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో లూడో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడేవాడు. అతనితో లూడో ఆడిన యువతి సైతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. రోహన్‌ పూర్వీకులు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట ప్రాంతానికి చెందిన వారు కాగా వ్యాపార నిమిత్తం షోలాపూర్‌లో స్థిరపడ్డారు. రోహన్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా మరింత పెరగడంతో ఇరువురూ ప్రేమించుకునే స్థాయికి వెళ్లింది. ఈ నేపధ్యంలో ఇద్దరూ న్యూడ్‌ కాల్స్‌ మాట్లాడుకునేవారు. అయితే యువతికి తెలియకుండా ఆమె న్యూడ్‌ కాల్స్‌ వీడియోలను రోహన్‌ స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి గూగుల్‌ డ్రైవ్‌లో భద్రపరిచాడు. అంతేగాకుండా యువతి ఫోన్‌కు, ల్యాప్‌ట్యాప్‌కు యాక్సెస్‌ పొంది ల్యాప్‌ట్యాప్‌లోని యువతికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సమస్తం అతను కాపీ చేసుకున్నాడు. అలాగే ఫోన్‌లోని డిజిటల్‌ సమాచారాన్ని అంతా అక్రమంగా సేకరించి ఉంచుకున్నాడు. వీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటున్న విషయాన్ని యువతి తండ్రి గుర్తించి గతంలోనే విజయవాడకు చెందిన పోలీసులతో అతడిని హెచ్చరించారు. దీంతో అప్పటి నుంచి యువతి తండ్రిపై కక్ష పెంచుకున్న రోహన్‌ యువతిని బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈనెల 26న యువతి తండ్రి పుట్టినరోజు నాడు అతనికి.. మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..ఈ సర్‌ప్రైజ్‌ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ మెస్సేజ్‌ సైతం పంపాడు. అలాగే యువతి బంధుమిత్రులకు, స్నేహితుల నెంబర్లకు.. వాళ్లకు తగిన శాస్తి చేశాను.. నేను వాళ్లకు విషం పెట్టానని అందరికీ చెప్తున్నారు అని ఇంగ్లిషులో మెస్సేజ్‌లు పంపాడు.

ఈ ఘటనలో బాధిత యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై, పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్న సమాచారం నూజివీడు సీఐ ఐవీ నాగేంద్రకుమార్‌కు తెలియడంతో వెంటనే వారిని స్టేషన్‌కు పిలిచి ఒక రోజంతా కౌన్సెలింగ్‌ చేశారు. వెంటనే యువతి నుంచి ఫిర్యాదు తీసుకొని షోలాపూర్‌లో ఉన్న రోహన్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. విలేకరుల సమావేశంలో సీఐ ఐవీ నాగేంద్రకుమార్‌, పట్టణ ఎస్సై–1 లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమై ఆపై ప్రేమ

మాయమాటలు చెప్పి న్యూడ్‌ కాల్స్‌ రికార్డు

ఆ వీడియోలను యువతి బంధుమిత్రులకు పంపి బెదిరింపులు

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement