కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణం మాకొద్దు అంటూ బర్కెట్‌నగర్ గ్రామంలో బుధవారం రైతులు, మాల మహానాడు నాయకులు ఆందోళన నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బొగ్గవరపు బాబురావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రతి రైతు పొలంలో ఆయుధ డిపో మాకు వద్దంటూ నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను ఇచ్చి తమ బతుకుదెరువును పాడు చేసుకోలేమన్నారు. కొందరు దళారులు దురుద్దేశంతో మంగపతిదేవిపేట, బోడిగూడెం, బర్కెట్‌నగర్, ఊట్లగూడెం, రేగులుకుంట గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఆయుధ డిపోకి ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, ఇది అవాస్తవమన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా పెట్టుకుని జీవిస్తున్న రైతులు పొట్ట కొట్టవద్దని బాబురావు అన్నారు. తరాలుగా వారసత్వం ప్రకారం వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతులకు మేలుచేయాలని అందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని, ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే ఈ ఆయుధ డిపో నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరారు. ఎడ్లపల్లి భాస్కరరావు, ఎడ్లపల్లి సూర్య చంద్రం, సొంగ బుచ్చయ్య, దుర్గారావు, ఎడ్లపల్లి బాబురావు, యడ్లపల్లి ఏసోబు, కానూరు శ్రీను, కానూరు రాజు తదితరులు పాల్గొన్నారు.


