మత్స్యకారులను రక్షించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులను రక్షించిన పోలీసులు

Aug 27 2026 1:00 AM | Updated on Aug 27 2026 1:00 AM

నరసాపురం రూరల్‌: కాకినాడ తీరం నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు నడిసముద్రంలో సాంకేతిక లోపానికి గురైంది. ప్రాణభయంతో అల్లాడుతున్న మత్స్యకారులను నరసాపురం పోలీసులు రక్షించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎనిమిది రోజుల క్రితం కాకినాడ జగన్నాథపురం నుంచి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఐదు రోజుల అనంతరం బోటులో సాంకేతిక లోపం తలెత్తి నడిసముద్రంలో మొరాయించింది. దీంతో వారంతా లంగరు వేసి అక్కడే నిలిచిపోయారు. అటుగా వచ్చిన మరో చేపల వేట బోటులోని మత్స్యకారులు ఈ పరిస్థితిని గుర్తించి అంతర్వేది మైరెన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన నరసాపురం పోలీసులు, తీరప్రాంతమైన వేములదీవికి చెందిన మత్స్యకారుల సహాయంతో సముద్రంలో చిక్కుకున్న వారిని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్షేమంగా రక్షించారు. మూడు రోజులుగా సరైన ఆహారం లేకపోవడంతో క్షేమంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు తీవ్ర నీరసానికి గురయ్యారు. ఇది గమనించిన నరసాపురం రూరల్‌ సీఐ నాగరాజు, ఎస్సై శారద సతీశ్‌ స్థానికుల సహకారంతో వారికి భోజనాలు సమకూర్చారు. అనంతరం బుధవారం ఉదయం వారు రోడ్డు మార్గాన కాకినాడ వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసి సహాయపడ్డారు. సురక్షితంగా బయటపడిన మత్స్యకారుల్లో కాకినాడకు చెందిన సంగాని సూర్యచంద్ర, మూస కామేశ్వరరావు, వాసపల్లి శ్రీనివాసు, దున్నా రాజు, పెసంగి జగ్గారావు, పెమ్మాడి భైరవస్వామి, కర్రి శ్రీను ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణభయంతో ఉన్న మత్స్యకారులను రక్షించడంలో సహకరించిన వేములదీవి ప్రాంత స్థానికులను, పోలీసులను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement