పెనుగొండ: జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్‌కు వెళ్లినప్పటికీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రాపాక సురేష్ (37) జీవనోపాధికోసం ఖతార్ వెళ్లారు. అక్కడ ఆర్థికంగా సతమతమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన... ఈనెల 14వ తేదీన ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు. మృతుడు సురేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అండగా నిలిచిన తెలుగు సంఘాలు
కనీసం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే ఆర్థిక స్థోమత కూడా లేకపోవడంతో, ఆయన బంధువు రత్నరాజు... ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ అధ్యక్షుడు వెంకట నరసింహం జోశ్యులకు సమాచారం అందించారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల సంఘాలు, ప్రవాసుల ఆర్థిక సహకారంతో మృతదేహానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం, భారత రాయబార కార్యాలయం సహకారంతో సురేష్ మృతదేహాన్ని ఆచంట వేమవరం గ్రామానికి పంపించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఏపీ ప్రవాసాంధ్ర సంఘం ప్రతినిధులు, డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబుకు సమాచారం అందించడంతో, ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని గ్రామానికి చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘ అధ్యక్షుడు వెంకట నరసింహం జోశ్యుల కృతజ్ఞతలు తెలిపారు.


