మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
కామవరపుకోట: రావికంపాడు అడ్డరోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తడికలపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ వీరంపాలేనికి చెందిన తాత విశ్వేశ్వరరావు (26) ఏలూరులోని ఓ పౌల్ట్రీ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన తోటి ఉద్యోగైన కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన సుదగని సాయి (24)తో కలిసి ఉదయం ద్విచక్ర వాహనంపై ఉద్యోగ పనుల నిమిత్తం బయలుదేరారు. పనులు ముగించుకుని తిరిగి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వైపు బైక్‌పై వస్తుండగా... రావికంపాడు అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశ్వేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విశ్వేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.
వీరంపాలెంలో విషాద ఛాయలు
మృతుడు విశ్వేశ్వరరావుకు ఇంకా వివాహం కాలేదు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దకొడుకు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందడంతో వీరంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై ఎస్. వల్లీ పద్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


