అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ప్రధాన సేవలు
● భారీగా పెరిగిన విస్తీర్ణం
● కొత్తగా నాలుగు మండలాల చేరిక
ఎలూడా, భీమా ఉడా కొత్త పరిధి మ్యాప్
అంశం ఎలూడా భీమా ఉడా
ప్రధాన కేంద్రం ఏలూరు భీమవరం
విస్తీర్ణం 5,353.65 చ.కి.మీ 2,174.675 చ.కి.మీ
మండలాలు 26 19
రెవెన్యూ గ్రామాలు 582 282
పట్టణ సంస్థలు 04 06
ద్వారకాతిరుమల : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల (అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు) స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎలూడా) పరిధి భారీగా విస్తరించగా, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (భీమా ఉడా) నూతనంగా ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు రెండు జీఓలను విడుదల చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఎలూడా పునర్వ్యవస్థీకరణ
జీఓ ఎంఎస్ నంబర్ 186 ఆధారంగా ఎలూడాను పునర్వ్యవస్థీకరించారు. గతంలో ఎలూడాలో ఉన్న 19 మండలాలు, 282 రెవెన్యూ గ్రామాలు, 6 పట్టణ ప్రాంతాలను విడదీసి నూతనంగా ఏర్పాటు చేసిన భీమా ఉడాలో చేర్చారు. అదే సమయంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, ద్వారకాతిరుమల మండలాలను కొత్తగా ఎలూడా పరిధిలోకి తీసుకువచ్చారు. గతంలో మచిలీపట్నం (ముడా) పరిధిలో ఉన్న కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు, రాజమహేంద్రవరం (రుడా) పరిధిలోకి వెళ్లిన ద్వారకాతిరుమల మండలం ఇప్పుడు ఎలూడా పరిధిలోకి వచ్చాయి.
ఎలూడా పరిధి ఇదే
తాజా నిర్ణయంతో ఎలూడా విస్తీర్ణం 3,179 చదరపు కిలోమీటర్ల నుంచి 5,353.65 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఎలూడా పరిధిలో మొత్తం 26 మండలాలు (ఏలూరు జిల్లాలోని 21, ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాలు), 582 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కొత్తగా చేరిన 5 మండలాల్లోని 137 గ్రామాలు (కై కలూరు–23, కలిదిండి–14, మండవల్లి–31, ముదినేపల్లి–33, ద్వారకాతిరుమల–36) ఇందులో భాగమయ్యాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, చింతలపూడి, తిరువూరు నగర పంచాయతీలు ఎలూడా పరిధిలోని పట్టణ ప్రాంతాలుగా కొనసాగుతాయి.
భీమా ఉడా ఆవిర్భావం
జీఓ ఎంఎస్ నంబర్ 181 ద్వారా భీమా ఉడా ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా డెల్టా, తీర ప్రాంతంలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలతో పాటు ఆకివీడు నగర పంచాయతీలు దీని పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు 19 మండలాలు, 282 రెవెన్యూ గ్రామాలు ఈ కొత్త అథారిటీ కిందకు వచ్చాయి.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం
ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పట్టణ ప్రాంతాలు, వాటి శివార్లలో మౌలిక వసతుల కల్పన, రహదారుల విస్తరణ, భూ వినియోగ నియంత్రణ సులభతరం కానున్నాయి. నివాస, వాణిజ్య, పరిశ్రమల ప్రాంతాల కేటాయింపును క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు అనుమతులు.
విక్రయాల కోసం వేసే లేఅవుట్లకు, భవన నిర్మాణ ప్లాన్లకు ఆమోదం.
నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల విభజన (జోనింగ్) నిర్ణయం.
రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ప్రణాళిక.
పార్కులు, బహిరంగ ప్రదేశాలు, ప్రజా ఉపయోగ స్థలాల పరిరక్షణ.
అనధికార నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే లేఅవుట్ల నిరోధం.


