తణుకు అర్బన్ : మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును మద్యం రవాణాలో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. తణుకు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో విఫలమై ప్రజలు తిరగబడే పరిస్థితి రావడంతో డైవర్షన్ కోసం ఇలాంటి అక్రమ అరెస్టులకు తెరతీసిందన్నారు. కారుమూరికి లిక్కర్ కుంభకోణానికి ఎటువంటి సంబంధంలేకపోయినప్పటికీ ముందుగా రూ.193 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ అంటూ పచ్చ మీడియాలో కథనాలు వేశారని మండిపడ్డారు. కానీ ఈ కేసులో తాజాగా రూ. 8 లక్షలు అవినీతిగా తేల్చడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఆయన లిక్కరు వ్యాపారిగా ఉన్నారా? లిక్కరు ట్రాన్స్‌పోర్టర్‌గా? ఉన్నారా? అని నిలదీశారు. అసలు వ్యాపారం చేసిన వారిని పట్టించుకోకపోగా, వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా పార్టీలో బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా ఎదుగుతున్న కారుమూరిని లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తాడేపల్లిగూడెం ఇన్‌చార్జ్ వడ్డి రఘురాం నాయుడు, భీమవరం ఇన్‌చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, నియోజకవర్గ ప్రచారకమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్ పాల్గొన్నారు.


