ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు

Aug 26 2026 12:54 AM | Updated on Aug 26 2026 12:54 AM

ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు నేటి నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు స్వల్పంగా పెరుగుతున్న గోదావరి వరద దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

బుట్టాయగూడెం : విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ మార్కులు సాధించాలని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆర్‌. ఆశ సూచించారు. బుట్టాయగూడెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్లస్‌ను మంగళవారం ఆమె సందర్శించి, అక్కడ నిర్వహించిన ఫ్రెషర్స్‌ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మిషన్‌ మార్క్‌ కార్యక్రమంలో నిర్దేశించిన ప్రకారం క్రమపద్ధతిలో చదువుకుని పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘జ్ఞానజ్యోతి’ శిక్షణ ముగింపు సభలోనూ ఆమె పాల్గొన్నారు. సార్వత్రిక విద్యాపీఠం ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ చదువుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ పీవీ రమణ, హెచ్‌ఎం కె.సుబ్బలక్ష్మి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కె.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

ద్వారకాతిరుమల: స్థానిక చినవెంకన్న ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 29 వరకు స్వామివారి దివ్య పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయంలో తెలిసీతెలియక జరిగే తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఏటా ఈ ఉత్సవాలను నాలుగు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఈ పవిత్రోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రతిరోజూ నిర్వహించే నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరిగి ఈ సేవలను 30వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

పోలవరం రూరల్‌ : గోదావరి వరద మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు శబరి నది నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 29 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వేలోని 48 గేట్ల ద్వారా 3.34 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కామవరపుకోట మండలం రావికంపాడు జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎంపై జరిగిన భౌతిక దాడి అత్యంత విచారకరమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై విధి నిర్వహణలో దాడులు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అందిన దరఖాస్తులను ఈ నెల 28, 29 తేదీల్లో పరిశీలించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో మొత్తం 188 దరఖాస్తులు రాగా, వాటిలో స్పెషల్‌ ఆఫీసర్‌ పోస్టుకు 86, పీఈటీకి 37, సీఆర్‌టీ (సోషల్‌)కి 40, పీజీటీ (ఫిజిక్స్‌)కు 25 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. నగరంలోని సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి వెరిఫికేషన్‌ ప్రారంభమవుతుందని, అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తో పాటు అవసరమైన జిరాక్స్‌ కాపీలతో హాజరుకావాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement