22ఏ భూ సమస్యల సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

22ఏ భూ సమస్యల సత్వర పరిష్కారం

Aug 26 2026 12:54 AM | Updated on Aug 26 2026 12:54 AM

22ఏ భూ సమస్యల సత్వర పరిష్కారం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో జూన్‌ 15 నుంచి ఆగస్టు 24 వరకు 22ఏ భూ సమస్యలపై వచ్చిన 449 దరఖాస్తులలో 180 దరఖాస్తులను పరిష్కరించామని జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి ఏలూరు జిల్లా ప్రగతిని వివరించారు. 22ఏ సమస్యలపై అందిన దరఖాస్తుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 182 అర్జీలను తగిన కారణాలు చూపుతూ తిరస్కరించామని, పెండింగ్‌లో ఉన్న 87 దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తామని చెప్పారు.

బొగ్గు వాయువు ఉత్పత్తి కాంప్లెక్స్‌ నిర్మాణం శుభపరిణామం

దేశంలోనే మొట్టమొదటి సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి కాంప్లెక్స్‌ ఏలూరు జిల్లాలో ఏర్పాటు కానుండటం శుభపరిణామమని జిల్లా కలెక్టర్‌ కే.వెట్రిసెల్వి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణపై ఆమె సంబంధిత అధికారులు, రిలయన్స్‌ ప్రతినిధుల బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి దశలో భాగంగా 20 ఎకరాల భూమి లీజు, రెండో దశలో 4,000 నుంచి 5,000 ఎకరాల భూసేకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి డ్రోన్‌ సర్వే పనులు ప్రారంభించాలని సర్వే సహాయక సంచాలకులకు సూచించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, విద్యుత్‌, నీరు, రహదారులు, పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై కంపెనీ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలకు రూ.414 కోట్లతో ప్రతిపాదనలు

2027లో జరగనున్న గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏలూరు జిల్లా నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాల కోసం జిల్లాలో రూ.414 కోట్లతో 388 పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం 28 స్నాన ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ముసునూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ముసునూరు జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని అధికారులతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌, మంచినీరు, టాయిలెట్లు, ర్యాంపుల వంటి ప్రాథమిక సౌకర్యాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement