● పల్లెర్లమూడి చిన్నారిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు
● రెండేళ్లలోనే కోర్టు తీర్పునకు పోలీస్ అధికారుల కృషి
ఏలూరు టౌన్: చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ముద్దాయికి చనిపోయే వరకు జైలు శిక్ష (జీవిత ఖైదు) విధిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నం స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. మరో మూడు సెక్షన్లలో ఒక్కో దానికి మూడేసి ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా కేవలం 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసి, స్పీడ్ ట్రయల్‌తో రెండేళ్ల కాలంలోనే కేసును ముగించి తుది తీర్పు వచ్చేలా చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ చేతుల మీదుగా పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించి, అభినందించారు.
రెండేళ్ల క్రితం ఏం జరిగిందంటే..
నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక రాత్రివేళ ఇంటి వరండాలో తల్లిదండ్రులు, నానమ్మతో కలిసి నిద్రపోతోంది. 2024 ఆగస్టు 8న రాత్రి 9:30 గంటలకు బాలికను కిడ్నాప్ చేసి పామాయిల్ తోటలోకి తీసుకువెళ్లి చిన్నారిపై అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో ఆమెను కొట్టి, రక్కి, పాప కాలి వెండి పట్టీలు, పాప తండ్రి సెల్‌ఫోన్ అపహరించి పరారయ్యాడు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో గ్రామంలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద బాధిత బాలిక బట్టలు లేకుండా కనిపించడంతో స్థానికులు ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. బాధిత బాలిక తల్లిదండ్రులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా... పోలీసులు బాధిత బాలిక తల్లి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. అప్పటి నూజివీడు రూరల్ ఎస్సై మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు దర్యాప్తు ప్రారంభించి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
రెండేళ్లకే కఠిన శిక్ష
2024 ఆగస్టు 8న జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ నూజివీడు సబ్‌డివిజన్ ఇన్‌ఛార్జ్‌గా ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏలూరు కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌ఛార్జ్ సీఐ ఎం.సుబ్బారావు, నూజివీడు డీఎస్పీ ప్రసాద్, నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ నిరంతర పర్యవేక్షణలో హెచ్‌సీ పేరూరి శ్రీనివాస్ సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పీపీ కన్నెకంటి చంద్రశేఖర్, భోగిరెడ్డి వెంకన్నబాబు 21 మంది సాక్షులను విచారించి, ప్రాసిక్యూషన్ తరఫున గట్టిగా వాదనలు వినిపించారు. 2026 ఆగస్టు 24న మచిలీపట్నం స్పెషల్ పోక్సో కోర్టు సెషన్స్ న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు.
నాలుగు కఠిన జైలు శిక్షలు
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోట గ్రామానికి చెందిన ముద్దాయి మిరియాల జయరావుకు న్యాయమూర్తి కఠిన శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించారు. పోక్సో చట్టం సెక్షన్ 5(ఎం) రెడ్‌విత్ 6, బీఎన్‌ఎస్ సెక్షన్ 65(2) ప్రకారం జీవిత ఖైదు (చనిపోయే వరకు), రూ.1,000 జరిమానా, బీఎన్‌ఎస్ సెక్షన్ 97 ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, , 309(6) ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, , బీఎన్‌ఎస్ సెక్షన్ 305 ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. బాధిత బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు.


