1/70కి తూట్లు
భూములు ఇచ్చే రైతుల వద్ద కూటమి నేతలు కమీషన్లు మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల వద్ద అగ్రిమెంట్లు చేసుకుంటూ.. ఎకరాకు అసలు పట్టాదారుడికి రూ.5 లక్షలు, అనుభవదారుడికి రూ.4 లక్షలు, భూ నష్ట పరిహారం ఇప్పించిన తమకు మిగతా డబ్బులు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెక్‌లు తీసుకొని, ప్రామిసరీ నోట్‌లు రాయించుకుంటున్నారని తెలిసింది. భూసేకరణను ఆపడం ఎవరి తరం కాదని కొందరు కూటమి నేతలు చెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పోరంబోకు, అసైన్‌మెంట్ భూములను కూడా ల్యాండ్ టు ల్యాండ్‌లో తీసుకుంటారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పోలవరం ముంపు ప్రాంతంలోని అమాయక గిరిజన నిర్వాసితులను కూటమి ప్రభుత్వం నిండా ముంచుతోంది. వరదలు వస్తే మునిగిపోయే భూములను గిరిజనులకు ల్యాండ్ టు ల్యాండ్ (భూమికి బదులు భూమి) కింద తీసుకొని మరోసారి వంచించనుంది. ఇలా ఏజెన్సీ ప్రాంతంలో రక్షణ కవచమైన 1/70 చట్టానికి తూట్లు పొడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఏటా వరదలకు ముంపు బారిన పడే 1,017 ఎకరాల భూమిని సుమారు రూ.200 కోట్లకు కొనుగోలు చేసి, వందల కోట్లు దండుకోవడానికి కూటమి నేతలు పథకం రచించారు. ఈ భారీ కుంభకోణంలో మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూయజమానుల వద్ద ఖాళీ చెక్కులు తీసుకొని ప్రామిసరీ నోట్ రాయించుకుంటున్నట్టు తెలిసింది. పోలవరం జిల్లా వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాల గిరిజనులకు ఏలూరు జిల్లాలో ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వను న్నారు. ఈ మేరకు వేలేరుపాడు మండలంలోని రాళ్లపూడి, గుళ్లవాయి, కుక్కునూరు మండలంలోని ఆర్వపల్లి, దాచారం రెవెన్యూలో భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. వీఆర్‌పురం మండలం ధర్మతాళ్లగూడెం వేలేరుపాడు మండలం గుళ్లవాయిలో 95.05 ఎకరాలు, రాళ్లపూడిలో 104.10 ఎకరాలు భూమి కేటాయించారు. అలాగే కూనవరం మండలం పెద్ద ఆర్కూరు గిరిజనుల కోసం కుక్కునూరు మండలం దాచారంలో 40.24 ఎకరాలు, అర్వపల్లిలో 267.19 ఎకరాల భూమి కేటాయించారు. చింతూరు మండలంలో గిరిజనులకు మాత్రం పోలవరం జిల్లా గంగవరం, రాజఒమ్మంగి మండలాల్లో భూసేకరణ చేయనున్నారు. 40, 50 ఏళ్ల క్రితం సీలింగ్‌లో వదిలేసిన భూములను కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్ (పీఎన్) ప్రకటించడం అధికారుల అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. కూటమి నేతల అండదండలతో కమీషన్ల కోసమే పీఎన్‌లో అధికారులు చూపారనే ఆరోపణలు ఉన్నాయి.
గిరిజనుల రక్షణ కవచమైన 1/70 చట్టానికి తూట్లు పొడిచి పీఎన్‌లో రెవెన్యూ రికార్డులను అనుసరించి ఇవ్వాల్సిన ప్రధానమైన పట్టాదారుడు, అనుభవదారుడి (పట్టాదార్, ఎన్‌జాయర్) కాలమ్‌ను అధికారులు కాలరాశారు. కేవలం ఆసామి చిరునామా అనే కొత్త కాలమ్‌ను అధికారులు సృష్టించారు. పట్టాదారుడు, అనుభవదారుడు కాలమ్ ఇస్తే, భూమిపై వాస్తవంగా ఎవరున్నారన్న విషయం బహిర్గతమవుతుందని తెలివి ప్రదర్శించారు. వేలేరుపాడు ప్రాంత భూములు సాగుకు అనుకూలం కాకున్నా.. ఇక్కడ ఎందుకు కేటాయించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏటా వచ్చే గోదావరి వరదలు, పెద్దవాగు ప్రాజెక్ట్ నీటి ప్రవాహానికి మునిగిపోయే భూములు కావడం వల్ల స్థానిక గిరిజనులకే ఆర్‌అండ్‌ఆర్ కింద వీటిని ఇవ్వలేదు. అయినా చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో అమాయక గిరిజనులకు ఈ భూములను కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. 2024 వరదల్లో పెద్దవాగు ప్రవాహానికీ ఈ పొలాలు ఇసుక మేటలు వేయగా.. పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించింది. ఏటా వరదలకు వేలేరుపాడు, కుక్కునూరులో వరదలకు రాకపోకలు స్తంభించిపోతాయి. అర్వపల్లికి వెళ్లాలంటే బోటుపై ప్రయాణించాల్సిందే. అలాంటి భూములను ఎందుకు పీఎన్‌లో చూపారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ల్యాండ్ టు ల్యాండ్ కింద ముంపు భూముల సేకరణ
1,017 ఎకరాల భూముల్లో రూ.200 కోట్ల కుంభకోణానికి శ్రీకారం
వీఆర్‌పురం, చింతూరు మండలాల గిరిజనులకు తీరని అన్యాయం
కూటమి నేతల మామూళ్ల మాయలో అధికారులు
ఎకరాకు రూ.6 లక్షల వరకు కమీషన్లు!


