తణుకులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
సాక్షి ప్రతినిధి,ఏలూరు: కారుమూరి కుటుంబంపై ‘పచ్చ’ వేధింపులు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో మాజీ మంత్రి కారుమూరిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో వేధింపుల రాజకీయాలకు తెరతీశారు. ఇంటిపై దాడికి యత్నించడం మొదలు అక్రమ కేసులతో నానా హంగామా సృష్టించారు. నియోజకవర్గ స్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో నిత్యం వేధిస్తూనే ఉన్నారు. ఇక గత మూడు నెలలుగా అరెస్ట్ అంటూ టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. చివరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అక్రమ కేసులో కారుమూరి అరెస్టు కావడంతో టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి యథావిధిగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మాట్లాడారు.
బీసీ నేతపై కక్ష గట్టి..
ఉమ్మడి పశ్చిమలో సీనియర్ నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి, బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. తణుకులో పార్టీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో కారుమూరి లక్ష్యంగా వేధింపుల రాజకీయాలకు తణుకులో టీడీపీ తెరలేపింది. ప్రధానంగా గోవధ కర్మాగారం నియోజకవర్గాన్ని పేకాటకు అడ్డాగా మార్చిన వైనం, అధిక ధరలకు మద్యం విక్రయాలతో పాటు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సమస్యలపై పోరుబాట కొనసాగించింది. ఈ క్రమంలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా తణుకులో వరుస కేసులు నమోదు చేశారు. ప్రధానంగా గతేడాది అత్తిలి ఉప ఎన్నికల సందర్భంగా నామమాత్రపు బలం లేకపోయినా టీడీపీ తెగబడి బెదిరింపుల రాజకీయాలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీకి ఎంపీటీసీల బలం సంపూర్ణంగా ఉన్న క్రమంలో కొందరిని బెదిరించి టీడీపీలోకి చేర్చుకున్నారు. మిగిలిన ఎంపీటీసీలను కారుమూరి అత్తిలిలో తన నివాసంలో ఉంచి పోలింగ్‌కు తీసుకువెళ్లే క్రమంలో వందలాది మంది పచ్చమూక ఎమ్మెల్యే రాధాకృష్ణ డైరెక్షన్‌లో కారుమూరి నివాసంపై దాడికి యత్నించి తీవ్రస్థాయి అలజడి సృష్టించి ఎన్నిక వాయిదా వేయించి తదనంతరం ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీలోకి తీసుకుని ఎంపీపీ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఇదే తరహా రాజకీయాలకు నియోజకవర్గాన్ని టీడీపీ కేంద్రంగా మార్చింది.
గోవధ కర్మాగారాన్ని వ్యతిరేకించడంతో..
తణుకులో గోవధ పశువధ కార్మాగారాన్ని హిందూ సంఘాల మొదలు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా అధికార పార్టీ పట్టించుకోకపోవడంతో వరుస ఆందోళనలు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొద్దిరోజుల పాటు కొనసాగించారు. అలాగే తణుకులో మద్యం విక్రయాలపై పొలిటికల్ ట్యాక్స్ కలిపి అధి క ధరకు ప్రజాప్రతినిధి కనుసన్నల్లో విక్రయిస్తుండటంపై నిరసనలు కొనసాగించారు. ఈ పరిణామాల క్రమంలో కారుమూరి మంత్రిగా చేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ రకరకాల అంశాలపై ఆరోపణలు గుప్పించి డైవర్షన్ రాజకీయాలకు తెరదీశారు. అక్రమ మద్యం కేసులో కారుమూరి కుమారుడు సునీల్ అరెస్టు అయిన నాటి నుంచి కారుమూరి కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియాలో క్యాపెయినింగ్ నిర్వహించారు. ని యోజకవర్గంలో ప్రధాన సమస్యలపై ప్రశ్నించినప్పుడల్లా ఇదే తరహాలో డైవర్షన్ రాజకీయాలు కొనసాగించారు. ఇక వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు ని ర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ని రసన ర్యాలీ అన్ని చోట్లా జరిగితే తణుకులో మా త్రమే కేసు నమోదు చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ ధర్నా సందర్భంలోనూ తేతలి జంక్షన్ వద్ద, వైఎస్సార్ విగ్రహం సెంటరులో ఫ్లెక్సీ విషయంలోనూ ఇలా ప్రతి దానిలో కారుమూరిపై కేసులు నమోదు చేయడం గమనార్హం.
పశ్చిమలో ప్రతిపక్ష కీలక నేతలే లక్ష్యం
అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
రెండేళ్ల నుంచి అధికార పార్టీ కుయుక్తులు
ప్రభుత్వ అక్రమాలపై కారుమూరి పోరుబాట
గతేడాది అత్తిలి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఆయన నివాసంపై దాడికి యత్నం
తణుకులో బరితెగించిన ‘పచ్చ’నేతలు
అక్రమ అరెస్టులు నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
తణుకు అర్బన్: మద్యం రవాణాలో మాజీ మంత్రి కారుమూరిపై అక్రమ కేసు నమోదుచేశారంటూ వైఎస్సార్‌సీపీ తణుకు నాయకులు స్థానిక నరేంద్ర సెంటర్‌లో సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చోడే గోపికృష్ణ, తణుకు నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్ మాట్లాడుతూ తణుకు వంటి ప్రాంతంలో ఒక బీసీ నేత ఎదగడాన్ని జీర్ణించుకోలేకే కూటమి నా యకులు కారుమూరిపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ప్రభుత్వ అక్రమా లు, హామీలపై నిలదీస్తున్న కారణంగానే కా రుమూరి కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్, ఎస్సీ సెల్ పట్టణ అద్యక్షుడు పెనుమాల రాజేష్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు జంగం ఆనంద్‌కుమార్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, నాయకులు కరిబండి రాజేష్, చిన్నూరెడ్డి, ఝాన్సీ లారెన్స్, మమతా యాదవ్, షేక్ ఫహీమా తదితరులు పాల్గొన్నారు.


