భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి పెద్దపీట

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

శ్రీవారి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

వివరాలను వెల్లడించిన ఆలయ ఈఓ త్రినాథరావు

ద్వారకాతిరుమల: చినవెంకన్న దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొండపైన ద్వారకా నిలయంలో సోమవారం ఆలయ ఛైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు అధ్యక్షతన ట్రస్ట్‌బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలు, కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ట్రస్ట్‌బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు మీడియాకు వెల్లడించారు.

ట్రస్ట్‌బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఇవే..

● భక్తులు నిర్వహించుకునే అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలకు రుసుమును రూ.500గా నిర్ణయించారు. లభ్యత మేరకు స్వామివారి తూర్పువైపు అనివేటి మండపంలో ఈ వేడుకలను ఉచితంగా నిర్వహించుకునేందుకు అనుమతించాలని నిర్ణయించారు.

● శ్రీవారి ఆశ్వీయుజ మాస తిరుకళ్యాణ మహోత్సవాల సందర్భంగా తాత్కాలిక విద్యుత్‌ అలంకరణ ఏర్పాటుకు వచ్చిన తక్కువ టెండర్‌ను ఆమోదించారు.

● స్వామివారి కొండపైకి వెళ్లే మార్గంలోని ప్రధాన టోల్‌గేట్‌ కూడలిలో శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి సిమెంట్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చిన తక్కువ టెండర్‌ను ఆమోదించారు.

● కొండపైన శ్రీ ధర్మ అప్పారాయ నిలయంలో 2, 3 వ అంతస్తుల నిర్మాణంతో పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా 630 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, ఓఎల్‌టీసీ ప్యానెళ్ల ఏర్పాటుకు వచ్చిన తక్కువ టెండర్‌ను ఆమోదించారు.

● తూర్పువైపు అనివేటి మండపంలోని ఫేజ్‌–1 ఉత్తర వైపు, ఫేజ్‌–2 ఉత్తర, దక్షిణ వైపుల్లో ఆర్నమెంటల్‌ బ్రిక్‌వర్క్‌, ఎంఎస్‌ బ్యారికేడింగ్‌ గ్రిల్స్‌ ఏర్పాటుకు వచ్చిన తక్కువ టెండర్లను ఆమోదించారు.

● కొండపైన కేశఖండనశాల ఎదురుగా ఉన్న పాత స్టోన్‌ పిచింగ్‌ డ్రెయిన్‌ పూర్తిగా దెబ్బతినడంతో దాని స్థానంలో సీసీ డ్రెయిన్‌ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ప్రతిపాదించారు.

● మాధవ కల్యాణ మండపంలోని నాలుగు మండపాలు, నాలుగు కిచెన్‌, డైనింగ్‌ హాళ్లలో ప్రత్యేక మరమ్మతు పనులకు సంబంధించిన అంచనాలను ఆమోదించారు.

● దొరసానిపాడు గ్రామంలోని స్వామివారి వ్యవసాయ భూమి లీజు హక్కు కోసం నిర్వహించిన బహిరంగ వేలంలో వచ్చిన హెచ్చుపాటను ఆమోదించారు.

● ప్రధాన దేవాలయం, దత్తత దేవాలయాలు, వివిధ ట్రస్టులకు సంబంధించిన జూలై 2026 ఆదాయ, వ్యయాలను ఆమోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement