అసంతృప్తి సర్వం.. ఆందోళనల పర్వం | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తి సర్వం.. ఆందోళనల పర్వం

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

ప్రజాసంఘాల పోరుబాట

ఉద్యోగులకు మోసం

పలాయన మంత్రం

ప్రజాసంఘాల పోరుబాట

కూటమి ప్రభుత్వంపై తిరుగు బావుటా

ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమాలు

ప్రజాసంఘాల పోరుబాట

విద్యార్థి సంఘాల ఆందోళనలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రంలో అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిఒక్కరిలో అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ముందు అలవికాని హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలో వచ్చిన తర్వాత అన్నీ అమలు చేసేశామంటూ హడావుడి చేస్తూ ఏమార్చే పనిలో పడ్డారు. దీంతో అన్నివర్గాలూ రోడ్లెక్కే పనిలో పడ్డారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనివ్వని స్థాయిలో ఉద్యమాలకు పిలుపునిచ్చాయి.

ఆందోళనల పర్వం

కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన ఆయావర్గాలు ఆందోళనాపథంలో పయనించడానికి సిద్ధమయ్యాయి. తమ ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు ఉన్న అన్ని బకాయిలూ చెల్లిస్తామని, పీఆర్‌సీ కమీషన్‌ వేసి ఉద్యోగుల జీతభత్యాలు పెంచుతామని బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారని ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు పీఆర్‌సీ కమిషన్‌ వేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ కమిషన్‌ వేసేలోపు మధ్యంత భృతి ఇవ్వాలని ఇలా మొత్తం 29 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఈనెల 28దీన ఐక్య ఉద్యమానికి పిలుపునిచ్చింది. విజయవాడలో తలపెట్టిన రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయడానికి ఇప్పటికే రంగంలోకి దిగింది. తమకు 2025లో పెంచాల్సిన స్టైపెండ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమాలు

20 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న టీచర్లకు అనుకోని విపత్తులా పరిణమించిన టెట్‌ అర్హత తప్పనిసరి అనే నిబంధనపై ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పలు ఉద్యమాలు చేశాయి. ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టెట్‌ అర్హత మార్కులు తగ్గించాలని, ఉపాధ్యాయులకు వారు బోధిస్తున్న సబ్జెక్టులోనే టెట్‌ నిర్వహించాలని, 2010కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, టెట్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25 నుంచి 30 వరకూ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ జాతాకు పిలుపునిచ్చింది. అలాగే సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న ఏపీసీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఎ న్నికల ముందు హామీలు ఇ చ్చిన నాయకులు దారుణంగా మోసం చేశారు. ఇప్పటివరకూ డీఏ బకాయిల ఊసే ఎత్తకపోవడం దారుణం. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం బాకీ పడ్డ కోట్లాది రూపాయలను వెంటనే విడుదల చేయాలి.

– చోడగిరి శ్రీనివాస్‌,

ఏపీ ఎన్‌జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు

ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కారంలో కూటమి ప్ర భుత్వం పలాయన మంత్రం జపిస్తోంది. వాట్సాప్‌లలో వివిధ అంశాలు అప్‌లోడ్‌ చేయాలని ఒత్తిడి చేస్తూ బోధనకు దూరం చేస్తోంది. దీంతో విద్యార్థులు అభ్యసనకు దూరమవుతు న్నారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది.

– గెడ్డం సుధీర్‌, వైఎస్‌ఆర్‌ టీచర్స్‌

అసోసియేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఏలూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని నిలదీస్తూ ఇప్పటికే ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేసిన ప్రజా సంఘాలు తమ ఉద్యమాలను రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి సమయాత్తమవుతున్నారు. జిల్లాలో కోకో సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలుచేయాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలులో లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేస్తు న్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగాలు ఇచ్చే వరకూ చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గత బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అలాగే సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గత గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడించారు. ఆయా ఆందోళనలు, నిరసనలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement