ముసునూరు: భారత ఉప రాష్ట్రపతి ముసునూరు మండల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి శాఖల వారీగా కేటాయించిన పనులపై సమీక్షించారు. సోమవారం ముసునూరులోని గోర్‌మే పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరిస్తారన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసి, విజయవంతం చేయాలని ఆదేశించారు. హనుమాన్ జంక్షన్ నుంచి ముసునూరులో సభాస్థలి వరకు పశువులు, మూగజీవాలు కాన్వాయ్‌లకు అడ్డురాకుండా చూడాలన్నారు. ఆర్టీసీ బస్సులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలన్నారు. అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్టు డీఆర్వో ఎం.శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. ముసునూరులో ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పీజీఆర్‌ఎస్ రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
కలిదిండి(కై కలూరు): జిల్లాలో శనివారం రాత్రి కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో 96.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే మండలాల వారీగా కై కలూరులో 24.8, ముదినేపల్లిలో 13.8, వేలేరుపాడులో 4.2, మండవల్లిలో 2.8 మీల్లీమీటర్లు వర్షం కురిసింది. మొత్తంగా 150.2 మి.మీ వర్షం కురవగా.. సాధారణ వర్షపాతం 5.4గా గుర్తించారు. జిల్లాలో 28 మండలాలకు 18 మండలాల్లో వర్షం పడలేదు.
అత్తిలి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 శాతం మంది బీసీ జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి వీరబ్రహ్మం అన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్‌లో ఆదివారం సంఘ మొదటి జిల్లా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది బీసీ ఉద్యోగులు ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేస్తామన్నారు. బీసీలకు క్రిమిలేయర్‌ను రద్దు చేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇచ్చేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు స్థలాలు కేటాయించాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించాలని, పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు వీరవల్లి రమేష్ మాట్లాడుతూ సంఘం తరఫున ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ డీఏ బకాయిలు, సీసీఎస్ రద్దు వంటి సమస్యలపై వినతిపత్రాలు అందించనున్నట్టు చెప్పారు. బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని రాష్ట్ర కౌన్సిలర్ టి.గణపతి అన్నారు. బీసీల్లో ఐక్యత లేకపోవటం వల్లే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీల ఐక్యత కోసం రాష్ట్ర సంఘ అధ్యక్షుడు వీరబ్రహ్మం విశేష కృషి చేశారని కేవీ రామారావు అన్నారు. బీసీలు అన్నిరంగాల్లో పురోగతి సాధించాలని జిల్లా ఉపవిద్యాశాఖధికారి ఎన్.రమేష్ అన్నారు. జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి వారధి వెంకట రమణారావు, కె.కృష్ణారావు, పంపన కుమారస్వామి, కె.రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ తానంకి శ్రీనివాస్, కె.శాంతారావు,, గుబ్బల రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.కృష్ణారావు అధ్యక్షత వహించారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు టెక్కలి గణపతి, జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో బీసీ ఉద్యోగులు తరలి వచ్చారు.


