● భక్తుడికి రూ.500కు అమ్మిన వైనం
● విచారణకు ఈఓ ఆదేశం
ద్వారకాతిరుమల: భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేసిన సమయంలో ఓ హోంగార్డు ఫ్రీ ఎంట్రీ పాస్ (వీఐపీ పాస్)ను రూ.500కు విక్రయించిన సంఘటన ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆదివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 10.45 గంటలకే శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఏలూరుకు చెందిన ఇద్దరు భక్తులు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఉత్తర రాజగోపురం వద్దకు చేరుకుని రూ.500 అంతరాలయ దర్శనం టికెట్లు కావాలని సిబ్బందిని కోరారు. ఓ హోంగార్డు రూ.500 తీసుకుని అంతరాలయ దర్శనం టికెట్ ఇచ్చాడు. ఒక భక్తుడు ఈ టికెట్‌తో అంతరాలయ దర్శనానికి, మరో భక్తుడు రూ.200 టికెట్‌తో అతిశీఘ్ర దర్శనానికి వెళ్లారు.
బయట పడిందిలా..
అంతరాలయ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తుడు టికెట్‌ను ఆలయ ఇన్‌స్పెక్టర్ పరిశీలించగా విషయం బయటపడింది. ఆ టికెట్‌ను ఉదయం 8.16 గంటలకు ఉంగుటూరు ఎమ్మెల్యే రిఫరెన్స్‌తో ప్రొటోకాల్ కార్యాలయంలో జారీ చేసిన ఫ్రీ ఎంట్రీ పాస్‌గా గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు సదరు భక్తుడిని విచారించారు. అనంతరం సదరు హోంగార్డును సూపరింటెండెంట్ ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో భక్తుడి నుంచి సూపరింటెండెంట్ రామారావు లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. జరిగిన విషయాన్ని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సమగ్ర విచారణకు ఆదేశించారు. ఫ్రీ ఎంట్రీపాస్ హోంగార్డుకు ఎలా వచ్చింది అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


