సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ కె.రమేష్‌కుమార్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్‌సీని వెంటనే నియమించి, ఐఆర్‌ ప్రకటించడంతో పాటు బకాయి పడ్డ ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు మంచి పీఆర్‌సీ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 28న విజయవాడ సీపీఎం కార్యాలయం వద్ద గల మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కమిషన్‌ వేయడంలో తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు. అలాగే మహిళా విభాగం చైర్‌పర్సన్‌ గీతిక మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కాదని, చర్చల పేరిట కాలయాపన చేయడం మాను కోవాలని స్పష్టం చేశారు. జేఏసీ వైస్‌ చైర్మన్‌ బి.సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్స్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వర్మ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఏపీ జేఏసీ అమరావతి నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement