ముసునూరు: ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. ముసునూరులో ఆదివారం పోలీస్ అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 459 మంది పోలీసు సిబ్బందిని నియమించామని, వీరిలో ముగ్గురు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 31 మంది ఎస్సైలు, 309 మంది ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 30 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 20 మంది రోప్ పార్టీ హోం గార్డ్స్, 50 మంది హోం గార్డ్స్, ఉన్నారన్నారు. వీవీఐపీ కాన్వాయ్ ప్రయాణించే మార్గం, కార్యక్రమ వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, కీలక ప్రదేశాల వద్ద భద్రతపై ప్రత్యేక దష్టి పెట్టాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. హెలిప్యాడ్, వేదిక, కాన్వాయ్ మార్గాల్లో సమన్వయంతో పనిచేయాలన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ, రోప్ పార్టీ, హోం గార్డ్స్, ప్రత్యేక బలగాలు తమకు కేటాయించిన ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పర్యటన ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాదరావు, అదనపు ఎస్పీ జి.మునిరాజా, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


