మేజిక్‌ స్టార్‌ బోస్‌కు అమెరికా అవార్డు | - | Sakshi
Sakshi News home page

మేజిక్‌ స్టార్‌ బోస్‌కు అమెరికా అవార్డు

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

మేజిక్‌ స్టార్‌ బోస్‌కు అమెరికా అవార్డు శోభనాచలుడికి విశేష పూజలు పోటెత్తిన భక్తజనం మహిళ అదృశ్యంపై కేసు నమోదు వ్యాపారి అదృశ్యంపై కేసు నమోదు

భీమవరం: మేజిక్‌ రంగంలో అసాధారణ ప్రతిభ, అంకితభావం, సేవాదృష్టి కనబరుస్తున్న ప్రముఖ మెజీషియన్‌ ’మేజిక్‌ స్టార్‌ బోస్‌’ను అమెరికా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అత్యంత ప్రముఖ వ్యక్తిగా గుర్తించింది. అమెరికా దేశపు 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించింది. మేజిక్‌ రంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న బోస్‌, వివిధ సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన ‘మెజీషియన్‌గా, రచయితగా 55 సంవత్సరాల నా ప్రస్థానం’ పేరుతో తన స్వీయ చరిత్ర గ్రంథాన్ని ప్రచురించి విడుదల చేశారు.

ఆగిరిపల్లి: స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శోభనాచలుడికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి పుణ్యాహవచనం, స్నపన, ప్రత్యేక అలంకరణ, విశేష అర్చన, పవిత్రములకు సంప్రోక్షణ శాంతి హోమం, పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

బుట్టాయిగూడెం: అభయారణ్యం మధ్యలోని ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సొంత వాహనాల్లో భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, పసుపు, కుంకుమలు, చీరలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

తణుకు అర్బన్‌: మహిళ అదృశ్యంపై తణుకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తణుకు రూరల్‌ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గుణ్ణం రాంబాబు భార్య మెంటమ్మ అలియాస్‌ దేవి (40) గత కొన్నాళ్లుగా తణుకు పట్టణంలోని కేక్స్‌ అండ్‌ కో షాప్‌లో పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే శనివారం తణుకులో దుకాణానికి ఉదయం 10 గంటలకు వచ్చిన ఆమె బ్యాంక్‌కు వెళ్లివస్తానని చెప్పి మధ్యాహ్నం 12 గంటలకు దుకాణం నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రావూరి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దేవి ఆచూకీ తెలిస్తే తణుకు రూరల్‌ స్టేషన్‌లో తెలపాలని కోరారు.

ద్వారకాతిరుమల: మండలంలోని సీహెచ్‌ పోతేపల్లి గ్రామానికి చెందిన ఆకెళ్ల శివగోపాలకృష్ణ అదృశ్యమయ్యాడు. నిమ్మకాయల వ్యాపారం నిమిత్తం తెనాలి వెళ్తున్నానని ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌కు పలుమార్లు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధుమిత్రులకు ఫోన్‌చేసి ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఆయన భార్య ఆకెళ్ల కెజియా ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement