● కలుషితంగా చావలిపాడు తాగునీటి చెరువు
● చెరువును అభివృద్ధి చేయాలని డిమాండ్
మండవల్లి: మండలంలోని చావలిపాడు తాగునీటి చెరువులో నీరు అట్టడుగు స్థాయికి చేరింది. ఈ చెరువును గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు వినియోగించడం మానేశారు. ప్రస్తుతం ఈ చెరువు నీటిని కేవలం వాడకానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. తాగడానికి, వంటలకు మాత్రం ఆర్వో ప్లాంట్ నీటిని టిన్‌కు రూ.25 నుంచి రూ.30 వెచ్చించి కొనుగోలు చేస్తూ, ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిన దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్న వాగ్దానాలు ఏమైనట్లు అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పేదవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులో ఉన్న నీటిని వినియోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాగునీటిని బయట డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెరువును అభివృద్ధి చేసి స్వచ్ఛమైన మంచినీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


