జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారికి శనివారం వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.1,81,250 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,025 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, సహాయ కమిషనర్, ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు.
ఆగిరిపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, స్నపన, ప్రత్యేక అలంకరణ, సాయంత్రం విష్వక్సేన పూజ, పవిత్రోత్సవాలు అంకురార్పణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, ముత్తేవి గోపాలకృష్ణమాచార్యులు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి పర్యవేక్షించారు.
కొయ్యలగూడెం: కన్నాపురంలోని దుర్గా భవాని సమేత రసలింగేశ్వర స్వామి శనివారం వేంకట రమణ దేవుని అలంకరణతో విశేష పూజలు అందుకున్నాడు. శ్రావణమాసం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించినట్లు అర్చకులు బ్రహ్మశ్రీ చిట్టా ప్రగడమణికంఠ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. కొయ్యలగూడెంలోని తహసిల్దార్ కార్యాలయం వెనుక ఉన్న గొలగమూడి వెంకయ్య అవధూత స్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు.


