ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నీతి ఆయోగ్ సూచనలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించడం అభినందనీయమని అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ అన్నారు. స్థానిక గన్ బజార్‌లో నిర్వహించిన సమితి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యక్ష ఎన్నికల విధానం వల్ల ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజా తీర్పుతో ఎన్నికయ్యామనే భావన కలుగుతుందన్నారు. దీనివల్ల ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు, బెదిరింపులు, క్యాంప్ రాజకీయాలకు తెరపడి స్థానిక సంస్థల్లో అభివృద్ధి, సంక్షేమం వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు ఎస్సీ, బీసీ నాయకులు పాల్గొన్నారు.


