వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజక ఇన్‌చార్జి గుడాల గోపి ధ్వజం
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో ఇప్పటికే ఉన్న యడ్లబజార్, రామయ్య హాలు డంపింగ్ యార్డులతో పాటు నేడు మంత్రి రామానాయుడు చొరవతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కూడా మూడో డంపింగ్ యార్డులా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఎద్దేవా చేశౠరు. ఇటీవల ఆసుపత్రి ప్రాంగణంలో ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో చెత్తను తరలించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా నిరసించడంతో స్పందించిన ప్రభుత్వం చెత్తను తొలగిస్తామని చెప్పినప్పటికీ, నేటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదన్నారు. శుక్రవారం తమ పార్టీ నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, అక్కడ ఇంకా మూడు అడుగుల మేర చెత్త పేరుకుపోయి ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రోగాలు తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వస్తే, మంత్రి సొంత నియోజకవర్గంలో మాత్రం కొత్త జబ్బులు బారిన పడేలా పరిస్థితులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మైక్ దొరికితే వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే మంత్రి రామానాయుడు, తన నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, పనుల్లో నాణ్యతా లోపాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చెత్తపై మట్టి కప్పి నిధులు పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం లభించింది అభివృద్ధి చేయడానికే తప్ప ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడానికి కాదని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను పట్టించుకోని తీరుకు నిరసనగా శనివారం నుంచి రామనామ జపం చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అక్రమాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, పాలపర్తి కృపానాథ్, లోపింటి చిరంజీవి, పితాని మురళీ తదితరులు పాల్గొన్నారు.


