ముదినేపల్లి(కై కలూరు): చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై ఎస్సై వీరభద్రరావు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం వడాలి గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేసే మరీదు ధర్మారావు భార్య గతంలో చిట్టీల వ్యాపారం నిర్వహించింది. కొందరు సభ్యులు చందాలు చెల్లించకపోవడంతో గ్రూపులను నిలిపివేసింది. అదే గ్రామానికి చెందిన నారగాని గంగమ్మ తనకు రావాల్సిన డబ్బుల కోసం కోర్టును ఆశ్రయించడమే కాకుండా తరచూ ధర్మారావు దంపతులతో గొడవపడేది. ఒత్తిడి తట్టుకోలేక ధర్మారావు భార్య ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా, ఆమె విశాఖపట్నంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కాగా, గురువారం గంగమ్మ మరో వ్యక్తితో కలిసి ధర్మారావు ఇంటికి వెళ్లే గొడవకు దిగింది. ఈ క్రమంలో గంగమ్మ ధర్మారావు చూపుడు వేలు కొరకడంతో పాటు, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయమైంది. బాధితుడిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: ఇన్‌స్ట్రాగామ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆశచూపి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. గ్రామానికి చెందిన నండూరి జితేశ్వర్ అనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి, ఈ నెల 20న మధ్యాహ్నం ఇన్‌స్ట్రాగామ్‌లో రీల్స్ చూస్తుండగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. బుక్స్ రాస్తే వారానికి రూ.25 వేలు ఇస్తామని రీల్ రావడంతో వారిని సంప్రదించాడు. అవతలి వ్యక్తులు పంపిన స్కానర్ ద్వారా దఫదఫాలుగా రూ.5,299 చెల్లించాడు. నగదు జమయ్యాక సదరు ఇన్‌స్ట్రాగామ్ ఐడీని సైబర్ మోసగాళ్లు బ్లాక్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జితేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.


