జంగారెడ్డిగూడెం (చింతలపూడి): మండలంలోని వేగవరం బీసీ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ డ్రైవర్ దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం–దేవరపల్లి ఎన్‌హెచ్–516డీ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్ నుంచి పిఠాపురం వెళ్తున్న టైల్స్ లారీ, కడియపులంక నుంచి పంజాబ్ వెళ్తున్న మొక్కల లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో టైల్స్ లారీ డ్రైవర్, గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు చెందిన హర్ష్ భాయ్ (55) క్యాబిన్‌లో నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మొక్కల లారీ డ్రైవర్, మైలవరం మండలం కీతిరాయగూడెం వాసి కొణతం వేణు (30) ఛాతి, కాళ్లకు బలమైన దెబ్బలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి జంగారెడ్డిగూడెంలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, రెండు వాహనాల క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


