కొల్లేరులో అక్రమ చెరువుల గట్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో అక్రమ చెరువుల గట్లు ధ్వంసం

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

భీమడోలు: కొల్లేరు అభయారణ్యం ఆగడాలలంక రెవెన్యూ పరిధిలోని 40 ఎకరాల అక్రమ చెరువు గట్టును గురువారం అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం, రెవెన్యూ అధికారుల సమక్షంలో, అటవీశాఖ సెక్షన్‌ అధికారి ఈశ్వరరావు పర్యవేక్షణలో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది ఈ చర్య చేపట్టారు. ఆగడాలలంక బీసీ సొసైటీకి చెందిన సర్వే నంబర్లు 1297, 1299, 1300, 1305 పరిధిలోని ఈ గట్లను అటవీ శాఖ సిబ్బంది ధ్వంసం చేశారు. గతంలోనూ కోర్టు ఆదేశాలతో ఈ చెరువును అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు. అయితే, 2026 జూన్‌ 30వ తేదీన గ్రామానికి చెందిన కూటమి నేతల ప్రోద్బలంతో సుమారు 300 మంది గ్రామస్తులు తెల్లవారుజామున దౌర్జన్యంగా చొరబడి చెరువు గట్టును పూడ్చి, అక్రమంగా చేపలు పెంచేందుకు గట్టును పునర్నిర్మించేందుకు ఉపక్రమించారు. అప్పట్లో అటవీశాఖ అధికారులు వారిని అడ్డుకున్నారు.

మరోసారి గండి కొట్టారు

తాజాగా అటవీశాఖ అధికారులు మరోసారి చర్యలు చేపట్టి, 40 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ ఆక్వా చెరువుకు గండి కొట్టారు. ఇదిలా ఉండగా, ఇదే చెరువుకు రెండుసార్లు గండ్లు కొట్టినా, రెండుసార్లు గ్రామస్తులు వాటిని పూడ్చిన విషయం విదితమే. అయితే, ఈ చెరువుకు పూర్తిస్థాయిలో నాలుగు వైపులా గట్లు ధ్వంసం చేస్తే మళ్లీ గండ్లు కొట్టేందుకు అవకాశం ఉండబోదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా రెండు రోజుల క్రితం ఆగడాలలంక రెవెన్యూ పరిధిలోని, దెందులూరు మండలం పోతునూరు గ్రామంలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిలోని అక్రమ ఆక్వా చెరువును కూడా ధ్వంసం చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి అక్రమంగా ప్రవేశిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీట్‌ అధికారి శ్రీకాంత్‌, అసిస్టెంట్‌ బీట్‌ అధికారి కొండలరావు, వివిధ సెక్షన్ల బీట్‌ అధికారులు, అసిస్టెంట్‌ అధికారులు, బేస్‌లైన్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement