ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో గుంపు ప్రభుత్వం ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని మాజీ ఐఏఎస్ అధికారి జీ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వాటిపై తాను సంధించిన ప్రశ్నలకు లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడంలేదని నిలదీశారు. టెట్ ఉత్తీర్ణులైన వారికే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇప్పటికే పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం టెట్‌లో అర్హత సాధించాల్సిందే అని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే అసలు పరీక్షలే లేకుండా క్రీడల కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. క్రీడలో కోటాలో ఉద్యోగాలు కల్పించడానికే ఒక ప్రత్యేక జీవో జారీ చేయడం, తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలిచ్చిన అనంతరం ఆ జీఓను రద్దు చేయడం చూస్తుంటే అక్రమాలు జరిగాయని అందరికీ స్పష్టంగా అర్థమౌతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు చదువు చెప్పడానికి చదువులేని వారిని నియమించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. సత్యం రాజు చలువతో విదేశాల్లో మేనేజ్‌మంట్ కోటాలో చదివిన లోకేష్‌కు చదువు విలువ ఏమి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. 2014లో దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి అయిన లోకేష్ వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని, తాను మాత్రం మెరిట్ ద్వారా ఐఏఎస్ అయ్యానన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో పునరావాసం ఏర్పాట్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తాము జీలుగుమిల్లిలో పర్యటిస్తే గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారన్నారని, తమ భూములు అక్రమంగా లాగేసుకుంటున్నారని వాపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులతో ఆటలాడద్దని హెచ్చరించారు. తాము అన్ని వర్గాలకు అండగా ఉంటామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ముందుగా 10 వేల కోట్లతో అంచనాలు వేయగా నిర్మాణం ఆలస్యం కావడంతో ఇప్పుడు రూ.55 వేల కోట్లకు అంచనాలు పెరిగాయని, 270 ముంపు గ్రామాల్లో 99 వేల కుటుంబాలు నిర్వాసితులుగా ఇప్పటికీ మిగిలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనలు పడుతున్న కష్టాలపై తమ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేకంగా అధ్యయనం చేసి వారి కోసం పోరాడతామన్నారు. సమావేశంలో మెండెం సంతోష్ కుమార్, జీ మోక్షానందం, డీ సుధీర్ పాల్గొన్నారు.


