వీరవాసరం: అంకితభావం, ప్రతిభ, కృషి, ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. దేశ సేవతో పాటు సమాజ సేవలో నిరంతరం పాటుపడిన ఉద్యోగికి పురస్కారాలు ఉత్తేజానిస్తాయి. అందులోనూ విశిష్ట అవార్డులు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి. అలాంటి అరుదైన ఘనతను సాధించారు వీరవాసరం మండలం కొణితివాడకు చెందిన డీఎస్పీ (స్పెషల్ బ్రాంచ్) దొంగ సత్యనారాయణ. ఆయన ఇప్పటివరకూ పలు మెడల్స్, అవార్డులు తీసుకున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రపతి పోలీస్ మెడల్‌ను ఇటీవల రెండోసారి స్వీకరించి ఖ్యాతి గడించారు. ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు కొణితివాడ హైస్కూల్‌లో చదువుకున్నారు. వీరవాసరంలో ఇంటర్ చదివి భీమవరం కేజీఆర్‌ఎల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1998 బ్యాచ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో చేశారు. సుదీర్ఘ సేవా కాలంలో ధైర్యం, అంకితభావం, క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధత, వృత్తిపరమైన నైపుణ్యంతో విశిష్ట సేవలు అందించారు. ఆయన సేవలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉన్నతాధికారులు గుర్తించి, రివార్డులతో సత్కరించారు.
పురస్కారాల పంట
దొంగ సత్యనారాయణ 12 క్యాష్ రివార్డులు, 12 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, 21 కమాండేషన్లు / ప్రశంసలు, ముఖ్యమంత్రి శౌర్య పథకం (2005), రాష్ట్రపతి పోలీస్ పతకం గ్యాలంట్రీ (2008, 2026), కేంద్ర ప్రభుత్వ అతి విశిష్ట సేవా పతకం (2015), సేవా పతకం (2021) అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందిస్తున్నారు. ఆయన ఇటీవల మరోసారి రాష్ట్రపతి పోలీస్ పతకం అందుకోవడం గ్రామానికే గర్వకారణంతా ఉందని గ్రామస్తులు అంటున్నారు.
డీఎస్పీ సత్యనారాయణ ఘనత


