చికిత్స పొందుతున్న లక్ష్మి తల్లి కుమారి
బాధితురాలితో మాట్లాడుతున్న డీఎస్పీ రవిచంద్ర
అత్తిలి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి, సదరు మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన అత్తిలిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం అత్తిలికి చెందిన నార్ని లక్ష్మికి గతంలో వివాహమైంది. అయితే ప్రస్తుతం భర్త లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ధనాల లోవరాజు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, సహజీవనం ప్రారంభించాడు. బుధ వారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన లోవరాజు, తనకు పిల్లలే ముఖ్యమా లేక తను కావాలో తేల్చుకోవాలని లక్ష్మితో గొడవకు దిగాడు. తనకు పిల్లలే కావాలని ఆమె తెగేసి చెప్పడంతో ఆగ్రహానికి గురైన లోవరాజు లక్ష్మితో పాటు ఆమె పెద్ద కుమార్తె ధనుష, తల్లిదండ్రులు కుమారి, ఏసులపై చాకుతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి పెద్ద కుమార్తె ధనుష పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కె.విశ్వనాథ్ తెలిపారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తాడేపల్లిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


