భీమవరం: భీమవరం: జనగణనలో బీసీ కులగణన చేపడతామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా, ఫార్మాట్‌లో ఆ ఊసే లేకుండా చేసి దేశంలోని 80 కోట్ల మంది బీసీలను కేంద్రం మోసం చేసిందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆరోపించారు. బుధవారం భీమవరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1, 2026 నుంచి చేపట్టే మొదటి దశ కుటుంబాల లెక్కింపులో ఓబీసీలను చేర్చాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని 40 ప్రశ్నల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అని మాత్రమే పేర్కొన్నారని, తెలంగాణ, బీహార్ తరహాలో ఓబీసీ కాలమ్‌తో పాటు ప్రతి కులానికి యూనిక్ నెంబర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బీసీ కులగణన చేయడం ఇష్టం లేదని విమర్శించారు. తక్షణమే గెజిట్‌ను సవరించి, జనాభా దామాషా ప్రకారం చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే ఎన్నికల వాగ్దానం ప్రకారం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కొడవర్తి శివప్రసాద్, బల్లా పరమేశ్వరరావు, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబి, మారిశెట్టి నరసింహమూర్తి, సతీష్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.


