నూజివీడు : మండలంలోని దిగవల్లి ఉపాధి హామీ (వీబీజీ రామ్‌జీ) పనుల్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శోభనాద్రి చెరువు పూడికతీత, గట్టు బలపరిచే పనుల పేరిట ఎలాంటి పనులు చేయకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ మస్తర్లు వేస్తున్నారని తెలిపారు. చెరువు గ్రామానికి ఆనుకుని ఉండటంతో ప్రతిరోజూ కూలీలను అక్కడికి తీసుకెళ్లి మస్తరు వేసి పంపించేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 11న 22 మంది, 12న 26 మంది, 13న 29 మంది, 14న 25 మంది, 17న 20 మంది పనిచేసినట్లు కాగితాల్లో చూపినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని స్పష్టం చేశారు. గతంలోనూ మండలంలో కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టడంతో అప్పటి ఏపీఓపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఉన్నతాధికారులు దిగవల్లి పనులపై తక్షణమే విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని కోరుతున్నారు.


