కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించాలి

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించాలి స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం రేపు ఏలూరులో జాబ్‌ డ్రైవ్‌ అంతర్జాతీయ స్కేటింగ్‌ పోటీలకు జెస్సీరాజ్‌

ఏలూరు (టూటౌన్‌): కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరులోని జలవనరుల శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఉప పర్యవేక్షక ఇంజనీర్‌ పి.ధనుంజయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలాల పరిధిలోని కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉందన్నారు. పోణంగి పుంత కాలువ ద్వారా ఏలూరు రూరల్‌ మండలంలోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని కోరారు. తూర్పు లాకుల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి కృష్ణా డెల్టాకు గతంలో వలె గోదావరి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్‌ చేశారు. నీళ్లందక నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసే అవకాశం లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రైతులు కొమ్మన సాంబశివరావు, తలారి జయరాజు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు పాఠశాలలకు ‘స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌’ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అత్యధిక స్కోరు సాధించిన పాఠశాలలను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈ అవార్డు కోసం ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీడీ/పీఈటీ, ప్రధానోపాధ్యాయుని సంతకంతో ధృవీకరించిన క్రీడా సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను దరఖాస్తుకు జతచేయాలని స్పష్టం చేశారు. క్రీడాంశాలకు సంబంధించిన పాయింట్ల వివరాలను అనుబంధ పత్రంలో పొందుపరిచారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జాబ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వి.వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఈ ఇంటర్వ్యూలలో ఫ్లిప్‌కార్ట్‌, పజ్జో సర్వీసెస్‌ లిమిటెడ్‌, రాయల్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు పాల్గొంటున్నాయని, డెలివరీ పార్టనర్స్‌, అసెంబ్లీ ఆపరేటర్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని పేర్కొన్నారు. పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 28 ఏళ్ల లోపు యువతీయువకులు అర్హులని, ఎంపికై న వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.20,000 వరకు వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పిస్తారని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో పాటు అవసరమైన సర్టిఫికెట్లు వెంటతెచ్చుకుని, ఫార్మల్‌ డ్రెస్‌లో హాజరుకావాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు 88868 82032 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

దెందులూరు: చైనాలోని జియాన్‌ నగరంలో బుధవారం నుంచి 22 వరకు జరగనున్న ‘ఇసు ప్రిక్స్‌–2026 ఇంటర్నేషనల్‌ జూనియర్‌ గ్రాండ్‌ స్కేటింగ్‌’ పోటీలకు జోగన్నపాలేనికి చెందిన అంతర్జాతీయ స్కేటర్‌, విద్యార్థి మాత్రపు జెస్సీరాజ్‌ ఎంపికైంది. ఈ వివరాలను ఐఎస్‌ఈ స్కేటింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జెస్సీరాజ్‌ ఇప్పటికే చైనా బయలుదేరి వెళ్లింది. కాగా స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న జెస్సీరాజ్‌.. గతేడాది రాష్ట్రపతి భవన్‌లో ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement