జంగారెడ్డిగూడెం: స్కాట్లాండ్‌లో జూలై 21 నుంచి 31 వరకు జరగనున్న కామన్వెల్త్ క్రీడల స్విమ్మింగ్ విభాగంలో భారతదేశం తరఫ/న ప్రాతినిధ్యం వహించడానికి స్థానిక బుడిగిన రవి కార్తీక్ ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి లోకేష్ అభినందించారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.సురేష్ కుమార్, ఆలయ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి.చందన పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. గత 101 రోజులకు స్వామికి హుండీ ద్వారా రూ.14,87,335 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, బోర్డు సభ్యులు అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగ సురేంద్ర, దండు భవాని, వడిగళ్ల కుమారి, ప్రియాంక, దివ్య ప్రసన్న పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరిచర్ల జగపతి రాజు, సభ్యులు గొట్టుముక్కల భాస్కరరాజు, ఏలూరు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, దొండపూడి, టి.నరసాపురం సేవా సంఘాల సభ్యులు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో భాగస్వామ్యులయ్యారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే ‘డీ–వాటరింగ్’ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులోని గ్యాప్–1 ప్రాంతంలో జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పనులను మొదలుపెట్టారు. వర్షాకాలం నేపథ్యంలో పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తోడిపోసేలా ఈ ఏర్పాట్లు చేశారు. డీ–వాటరింగ్ కోసం మొత్తం 240 మోటార్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటి ద్వారా గరిష్టంగా 700 క్యూసెక్కుల నీటిని తోడే అవకాశం ఉంది. ఈ మోటార్లలో 88 హార్స్ పవర్, 83.5 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన యంత్రాలు ఉన్నాయి. తొలి రోజు 40 మోటార్లను ప్రారంభించగా, రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మిగిలిన మోటార్లను నడపనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య జరగబోయే ఈసీఆర్‌ఎఫ్ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ డీ–వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
భీమవరం: విశాఖపట్నం గంభీరగెడ్డ రిజర్వాయర్‌లో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్‌రాష్ట్ర కనోయింగ్ అండ్ కయాకింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భీమవరం బీవీ రాజు డిగ్రీ కళాశాల విద్యార్థిని వనమాడి మౌనిక రెండు కాంస్య పతకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఐఆర్ కృష్ణంరాజు చెప్పారు. సోమవారం పతకాలు సాధించిన మౌనికను అభినందించిన సందర్భంగా ఆయన వివరాలు తెలిపారు. ఈ నెల 4న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాప్ సహకారంతో పోటీలు జరిగాయన్నారు.


