ఆడబిడ్డల ఆక్రోశం
కీలక ప్రాజెక్టులు గాలికే..
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఆడబిడ్డ నిధి అడ్రస్ లేదు.. అర్హులందరికీ తల్లికి వందనం అందలేదు.. జిల్లా దశదిశ మార్చే అభివృద్ధి పథకాల హామీల అమలు అతీగతీ లేదు.. మామిడి నుంచి వరి వరకూ అన్నదాతలకు నిత్య సంక్షోభమే.. లెక్కకు మించి హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్నింటినీ విస్మరించిన కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు నిండాయి. అక్రమ కేసులు, వేధింపుల పర్వం, ప్రతిఘటిస్తే వ్యక్తిగత ఆస్తుల ధ్వంసరచన.. ఇంతకుమించి జిల్లాలో జరిగిందేమీ లేదు. పచ్చనేతల దందా.. ఊరూరా బెల్టుషాపులతో యథేచ్ఛగా మద్యం విక్రయాలకు తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా..
కూటమి మోసపూరిత హామీలతో జిల్లా ప్రజలు నష్టపోయిన వైనాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనలు, సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాల ద్వా రా ప్రజలకు వివరించారు. దీనిలో భాగంగా ఏ లూరు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 ని యోజకవర్గాల్లో పార్టీ సమస్వయకర్తల నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ రెండేళ్లలో ఉమ్మడి జిల్లాలో కనీసం రూ.100 కోట్ల అభివృద్ధి పనులు కూడా జరగకపోవడం గమనార్హం.
ఉమ్మడి పశ్చిమలో ఆక్వా, వరి, మామిడి, కోకో రైతాంగం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా 52 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి టన్ను రూ.లక్ష పైనే రావాల్సిన ధర రూ.10 వేలకు పరిమితమైనా సర్కారు పట్టించుకోలేదు. ఇక జిల్లాలో 45 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కోకో పంట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా కేజీ రూ.1,040 పలకగా నేడు రూ.300లకు పరిమితమైంది. ఇక వరి రైతులు పూర్తిస్థాయిలో ప్రకృతి విపత్తులు, గిట్టుబాటు ధర కేంద్రం ప్రకటించినా దళారుల చేతికి చిక్కి భారీగా నష్టపోవడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. అలాగే ఉమ్మడి జిల్లాలో 2.52 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఆక్వా సాగు క్రాప్ హాలిడే దిశగా పయనిస్తుంది.
ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీ కూడా అటకెక్కింది. జిల్లాలో 5,47,790 కుటుంబాలకు నెలకు రూ.3 వేల చొప్పున రూ.164 కోట్లు సర్కారు బకాయి పడింది. రెండేళ్లకు రూ.3,936 కోట్లు నిరుద్యోగభృతిని సర్కారు ఎగ్గొట్టింది. అలాగే పేదరిక నిర్మూలన పీ–4 అంటూ హడావుడి చేస్తున్నారు. పేద కుటుంబాల స్థితిగతులు క్షేత్రస్థాయిలో ఏ మాత్రం మారకపోయినా అధికారుల రికార్డుల్లో మాత్రం 71,910 బంగారు కుటుంబాలను గుర్తించి 70 శాతానికిపైగా దత్తత కార్యక్రమం పూర్తయిందని చెప్పడం విశేషం. 50 ఏళ్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా వేల సంఖ్యలో పెన్షన్లను రకరకాల సాకులతో తొలగించారు.
19 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో నాయకులు ఇంటింటికీ తిరిగి హామీల బాండ్లు కూడా ఇచ్చారు. ఈ లెక్కన జిల్లాలో 6,71,033 మంది మహిళలకు రూ.120 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. సుమారు రెండేళ్లలో రూ.2,880 కోట్ల మేర మహిళలు మోస పోయారు. అలాగే తల్లికి వందనం కూడా పథకాన్ని కూడా నామమాత్రంగానే ఇస్తున్నారు. విద్యాశాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 2,72,135 మంది విద్యార్థులుండగా 2,38,434 మందికే అమలు చేసి 33,701 మంది విద్యార్థులకు హ్యాండిచ్చారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం 2026 మార్చికల్లా పూర్తి చేస్తామని, 2025 బడ్జెట్‌లో ప్రకటించి రూ.1,780 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకపోగా పథకాన్ని పూర్తిగా పడకేసేలా చేశారు. ఇక ఏలూరులో ఉన్న శనివారపుపేట కాజ్‌వే తమ్మిలేరు వరదలకు ఏటా మునుగుతున్న క్రమంలో గతేడాది నగర పర్యటనకు వచ్చిన సీఎం రూ. 90 కోట్లతో కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మిస్తామని వెంటనే అనుమతులు ఇస్తున్నామని ప్రకటించారు. కట్ చేస్తే.. దాని ఊసేలేదు. ఇక కోకో సిటీ అని, ఆక్వా హబ్ అని ఇలా పలు హామీలిచ్చి మొత్తాన్ని మంగళం పాడేశారు.
ఆడబిడ్డ నిధి అందలేదు
నిరుద్యోగ భృతి ఊసులేదు
జిల్లాలో జాడలేని అభివృద్ధి
కూటమి రెండేళ్ల పాలనలో దౌర్జన్యకాండ
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు


