ఆరోగ్యశ్రీ సేవలపై కలవరం
భీమవరం (ప్రకాశం చౌక్): ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)ని నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలకు గాను నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోగా మరో భారం మోపేందుకు సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా కోట్లాది రూపాయిల బకాయిలు పెట్టింది. దీంతో ఆయా ఆసుపత్రుల్లో పేదలకు అందాల్సిన వైద్యసేవలపై నీలినిడలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులపై యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంటూ మరో భారం వేసేందుకు సిద్ధమైంది. దీంతో మేము వైద్యసేవలు అందించలేమంటూ నెట్‌వర్క్ ఆసుపత్రులు కూటమి ప్రభుత్వానికి అల్టీమేటం జాజుఠీ చేశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పటల్స్ ఆసోసియేషన్ (ఆశ) నిర్ణయం తీసుకుంది.
కొత్త వైద్య స్కీమ్ మా వల్ల కాదు
వచ్చేనెల నుంచి యూనివర్సల్ హెల్త్ స్కీమ్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈపథకం విధి విధానాలు రూపొందించడంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యులతో గానీ అసోసియేషన్‌తో గానీ చర్చించకుండా ఈ పథకం రూపొందించి బలవతంగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటుంది. దాంతో నూతన పథకంలో సేవలందించేందుకు తాము సిద్ధంగా లేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కూటమి ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ఆరోగ్యశ్రీకి సంబంధించి నెలల తరబడి బకాయిలు చెల్లించకుండా కొత్త పథకాలు నెట్‌వర్క్ ఆస్పత్రులపై రుద్దడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు బకాయిలు
జిల్లాలో అన్ని కలుపుకుని దాదాపు 30 వరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్ వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో మూడు నెలల క్రితం వైద్యసేవలు అందించలేక నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. అప్పుడు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించలేదు. జిల్లాలో 30 నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.3 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. సాధారణ ఆస్పత్రికి రూ.3 కోట్లు వరకు బకాయి ఉంటే మల్టీస్పెషాల్టీ ఆస్పత్రులకు రూ.10 నుంచి రూ.30 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో అప్పులు చేసి మరీ ఆస్పత్రుల నిర్వహణ చేయాల్సి వస్తోందని అసోసేయేషన్ నాయకులు చెబుతున్నాయి.
డిస్కాంట్ కోసం ప్రభుత్వం బేరాలు
నెట్‌వర్క్ ఆస్పత్రులకు కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టడంతో ఆయా ఆస్పత్రులు నిర్వహణ భారంగా మారింది. దీంతో మా బకాయిలు చెల్లించండి అడుగుతున్న నెట్‌వర్క్ ఆస్పత్రులతో కూటమి ప్రభుత్వం డిస్కాంట్ ఇవ్వాలి అంటూ బేరాలు అడుతోంది. 10 నుంచి 15 శాతం డిస్కాంట్ ఇస్తే బకాయిలు చెల్లిస్తామంటే నెట్‌వర్క్ ఆస్పత్రులు చేసేది లేక 4 శాతం డిస్కాంట్‌కు సరేనన్నా 15 శాతం డిస్కాంట్ ఇస్తేనే దఫదఫాలుగా చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం తెగేసి చెబుతుండడంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.
నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వం
వచ్చేనెల నుంచి మరో కొత్త స్కీమ్ అమలు
తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన నెట్‌వర్క్ ఆసుపత్రులు
ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో కలవరం
కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరితో విసుగు చెందుతున్న నెట్‌వర్క్ ఆస్పత్రులు బకాయిల కోసం మళ్లీ సమ్మెకు దిగి వైద్య సేవలు నిలుపుదల చేస్తాయేమోనని ప్రజల్లో కలవరం రేగుతోంది. గతంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె చేయడంతో పేద ప్రజలు వైద్యం కోసం విలావిల్లాడి అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందారు. జిల్లాలో మెడికల్ కళశాల పూర్తికాకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యులను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మెకు దిగిన సమయంలో జిల్లా ప్రజలు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఆ రోజులను ఈ కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందా? అనే ఆందోళన జిల్లా ప్రజల్లో ఉంది.


