ముగిసిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు

Mar 14 2026 7:51 AM | Updated on Mar 14 2026 7:51 AM

ముగిసిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు జాతీయ స్థాయి నాటికల పోటీలు ప్రారంభం

నూజివీడు: నూజివీడులోని సారథి ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏలూరు జిల్లా నూజివీడులో మూడు రోజుల పాటు నిర్వహించిన 15వ అండర్‌–15, 2వ అండర్‌–13, 7వ అండర్‌–10 అంతర్‌ జిల్లాల ఆర్చరీ చాంపియషన్‌ షిప్‌ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఏపీ ఆర్చరీ అసోసియేషన్‌, చెరకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్‌, స్పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. కాంపౌండ్‌ విభాగంలో పోటీల్లో 100మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శుక్రవారం రికర్వ్‌ విభాగంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 26నుంచి ఏప్రిల్‌ 7 వరకు గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీలో నిర్వహించే జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఏపీ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ముగింపు కార్యక్రమంలో కొత్త రావిచర్ల సర్పంచ్‌ కాపా శ్రీనివాసరావు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చెరుకూరి దుర్గాప్రసాద్‌, సారధి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సూరానేని శ్రీధర్‌, చెరుకూరి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు సెంట్రల్‌ : కళలకు నిలయం కళాకారులకు ఆలయం వంటి క్షీరపురిలో కళానైపుణ్యానికి ఇక్కడి కళాభిమానులు, కళాకారులు ఎంతో వన్నె తెస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. శుక్రవారం పాలకొల్లు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్‌ వద్ద అడబాల థియేటర్స్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో కళాకారులను అందించిన ఘనత ఈ క్షీరపురిదన్నారు. నాటిక రంగం నుండి ఎంతోమంది కళాకారులు సినీ ఇండస్ట్రీలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేశారన్నారు. మొదటి రోజు ఉషోదయ కళానికేతన్‌ కట్రపాడు ఆధ్వర్యంలో మంచి మనసులు నాటిక, అరవింద్‌ ఆర్డ్స్‌ తాడేపల్లి వారు నిర్వహించిన దేవుణ్ణి చూసా నాటికలు కళాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్‌ భీమవరం అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్‌, కళాపరిషత్‌ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ, యడ్ల తాతాజీ, జక్కంపూడి కుమార్‌, కోరాడ శ్రీనివాసరావు, మానాపురం సత్యనారాయణ, ఖండవల్లి వాసు, మేడికొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తండ్రీకొడుకుల నిజాయితీ

జంగారెడ్డిగూడెం: మహిళ చేజార్చుకున్న పర్సు, అందులోని నగదు, సెల్‌ఫోన్‌ను తండ్రీ కొడుకులు నిజాయితీగా సదరు మహిళ కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా జేగూరుపాడుకు చెందిన ఒక మహిళ రాజమండ్రి షాపింగ్‌కు వెళ్లింది. ఆటోలో తిరిగి వస్తుండగా, ఆటోలో నుంచి సెల్‌ఫోన్‌, కొంత నగదు ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ జారిపడిపోయింది. అయితే ఈ బ్యాగ్‌ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీకి చెందిన రెల్లి దాలి నాయుడికి దొరికింది. సదరు బ్యాగ్‌ను పట్టుకుని వేగవరం ఇంటికి వచ్చాడు. తన కుమారుడు రెల్లి చైతన్య లక్ష్మణ్‌కు బ్యాగ్‌ను దొరికిన విషయం చెప్పగా, చైతన్య లక్ష్మణ్‌ బ్యాగులోని వస్తువులను పరిశీలించి, అందులోని ఆధార్‌కార్డును తీసి, ఆధార్‌లో ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌చేసి నేను జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నుంచి ఫోన్‌ చేస్తున్నాను. మీరు పొగొట్టుకన్న బ్యాగ్‌ దొరికింది.. అది నా వద్ద ఉంది, ఎవరైనా వస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో సదరు మహిళ కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం రాగా, చైతన్య లక్ష్మణ్‌ రూ. 3500 నగదు, సెల్‌ఫోన్‌, ఆధార్‌కార్డు, ఇతర స్లిప్పులు ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ను జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ సమక్షంలో మహిళ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తండ్రి కొడులను నిజాయితిని మెచ్చి రూ. 1000 నగదు బహుమతి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement