సర్వజన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సర్వజన కష్టాలు

Mar 14 2026 7:50 AM | Updated on Mar 14 2026 7:50 AM

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవల దుస్థితిపై జనం గగ్గోలు పెడుతున్నారు. తీవ్ర అనారోగ్యం వస్తే రోగుల కష్టాలు వర్ణనాతీతం. గుండెపోటు, కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడితే సామాన్యుడి కుటుంబం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది. ఏలూరు జీజీహెచ్‌లో కీలకమైన విభాగాల్లో నిపుణులైన వైద్యులు కరువయ్యారనే అపవాదు ఉంది. ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అత్యవసర విభాగానికి వస్తే.. ‘మీ చావుకు మా బాధ్యత లేదు’ అంటూ రిఫర్‌ చేస్తూ చేతులు కడిగేసుకుంటున్నారు వైద్యులు. రక్త పరీక్షల నుంచి వైద్య చికిత్స, శస్త్రచికిత్సల వరకూ ఎక్కడా ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా వైద్యసేవలను మెరుగుపరిచేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయటం లేదంటూ రోగులు వాపోతున్నారు.

ఐసీయూలో బెడ్స్‌ ఉన్నా..

రోజూ జీజీహెచ్‌లో ఓపీ, అత్యవసర విభాగానికి సుమారు 1,800 నుంచి 2 వేల మంది వరకు రోగులు వస్తుంటారు. జీజీహెచ్‌లో మొత్తం బెడ్స్‌ 580 వరకూ ఉండగా ఐసీయూ బెడ్స్‌ 50 ఉన్నాయి. అత్యవసర విభాగానికి సంబంధించి ఐసీయూ బెడ్స్‌ మరిన్ని పెంచాల్సి ఉంది. బెడ్స్‌ ఖాళీగానే ఉన్నా ఆయా విభాగాల హెచ్‌ఓడీల నిర్లక్ష్యంతో రోగులను ఇన్‌ పేషెంట్లుగా చేర్చుకోవటం లేదని చెబుతున్నారు. బెడ్స్‌ ఖాళీగానే ఉంచుతున్నారు తప్ప రోగులకు వైద్యసేవలు అందించాలనే ఆలో చన లేదనీ, విజయవాడ, గుంటూరు రిఫర్‌ చేస్తూ చేతులు దులుపేసుకుంటున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యసేవలు, సౌకర్యాలు నిల్‌

పేరు గొప్ప...ఊరు దిబ్బ అన్న చందంగా సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు ఉన్నాయి. ఎంసీహెచ్‌ విభాగంలో గర్భిణులు, బాలింతల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. గైనకాలజిస్ట్‌ వైద్యుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. ప్రసూతి ఆప రేషన్లు సైతం నిర్లక్ష్యంగా చేయటంతో కుట్లు విడిపోవటం, రెండుసార్లు శస్త్రచికిత్స చేయాల్సి రావటంతో గర్భిణులు భయపడుతున్నారు. రోగుల సహాయకులు, బంధువులు హాస్పిటల్‌కు వస్తే చెట్ల నీడనే ఆశ్రయించాల్సి వస్తోంది. వేసవిలో తీవ్రమైన ఎండలో సహాయకులు మాడిపోవటం ఖా యమంటున్నారు. మరోవైపు రోజూ మధ్యాహ్నం వ రకూ ఓపీ సేవలకు సంబంధించి రోగులు ఎండలోనే ఒక షెడ్డులో కూర్చొని నిరీక్షించాల్సి వస్తుంది. రక్త పరీక్షలకు రోగులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌లో వీల్‌చైర్లపై రోగుల సహాయకులే తోసుకుంటూ వెళ్లాల్సిన దృశ్యాలు కనిపిస్తున్నా యి. వృద్ధులు, చదువురాని వారికి ఏ రోగానికి ఏ వార్డులో చూపించుకోవాలో చెప్పేవారు లేరు. జీ జీహెచ్‌ భవనం, డ్రెయినేజీ వ్యవస్థ, పైప్‌లైన్స్‌ శి థిలావస్థకు చేరటంతో మరుగుదొడ్లులోని మురుగునీరు బయటకు వస్తుంది. రోజూ క్లీన్‌ చేసినా ఉ పయోగం లేదని రోగులు అంటున్నారు.

వైద్యం.. పూజ్యం

ఏలూరు జీజీహెచ్‌లో అందని సేవలు

ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్స్‌ ఉన్నా ఫలితం లేదు

చెత్తకుప్పలా తయారైన వార్డులు

గర్భిణులు, బాలింతలకు తప్పని తిప్పలు

సహాయకులకు చెట్ల నీడే ఆశ్రయం

శిథిలావస్థలో డ్రెయినేజీ వ్యవస్థ

చెత్తకుప్పలా వార్డులు ?

ఏలూరు జీజీహెచ్‌ను వైద్య అధికారులు చెత్తకుప్పలా మార్చివేస్తున్నారని రోగులు అంటున్నారు. ఇటీవల రూ.5 కోట్ల విలువైన ఫర్నీచర్‌ వచ్చింది. మెరుగైన సౌకర్యాలతో బెడ్స్‌, టేబుల్స్‌, ఆపరేషన్‌ థియేటర్‌ పరికరాలు ఇలా సామగ్రి వచ్చింది. ఇక కొంత కొత్త, పాత సామగ్రిని, ఫర్నీచర్‌ను ఇష్టారాజ్యంగా వార్డుల్లోనూ, హాస్పిటల్‌ ప్రధాన ద్వారం వద్ద, ఎమర్జెన్సీ వార్డుల వద్ద పెట్టడంతో అవన్నీ చెత్తకుప్పలా మారిపోయాయి. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో డీఎంఈ నుంచి ఫర్నీచర్‌ వస్తే వాటిని ఏ విధంగా వినియోగించాలో తెలియక నిరుపయోగంగా వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement