● నిందితుడిని అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు
● బయటపడుతున్న ఆలయాల్లోని భద్రతా వైఫల్యాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఈనెల 11న జరిగిన హుండీ కానుకల చోరీ కేసు సంచలనంగా మారింది. ఇందులోని నిందితుడు పలు ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న హుండీల నగదు లెక్కింపులో సైతం కొన్నేళ్లుగా పాల్గొంటున్నాడు. దీంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం సూరంపూడి గ్రామానికి చెందిన బొల్లా సురేష్ సేవ పేరుతో గత 8 ఏళ్ల నుంచి శ్రీవారి హుండీల నగదు లెక్కింపులో పాల్గొంటున్నాడు. గత బుధవారం జరిగిన లెక్కింపులో పాల్గొన్న సురేష్ 59.700 గ్రాముల బరువైన బంగారపు గొలుసు, రెండు మంగళ సూత్రాలు, నాలుగు యూఎస్ డాలర్ల నోట్లను తస్కరించి అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. సురేష్ ద్వారకాతిరుమలతో పాటు అన్నవరం, సింహాచలం, విజయవాడ, వాడపల్లి ఆలయాల్లో సై తం జరిగే హుండీల నగదు లెక్కింపుల్లో పాల్గొంటున్నట్టు స్పష్టమైంది. అయితే సురేష్ చిన వెంకన్న ఆలయంలో చోరీ చేయడం ఇదే మొదటిసారా.. లేక అంతక ముందు ఎప్పుడైనా చోరీలు చేశాడా.. అన్నదానితో పాటు, ఇతర ఆలయాల్లో కూడా ఏమైనా చోరీలకు పాల్పడ్డాడా.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ పది మంది ఎవరూ..
పోలీసుల విచారణలో కొంత సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా గురువారం నిందితుడిని తీసుకుని మండపేట, అమలాపురంలో తిరిగారు. ఇదిలా ఉండగా హుండీల లెక్కింపుల్లో పాల్గొనే వారిలో మరో పది మంది బ్యాచ్ చోరీలకు పాల్పడుతున్నట్టు చెబుతున్న సురేష్ వారి పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నట్టు సమాచా రం. ప్రస్తుతం ఆ పది మంది ఎవరూ.. వారికి ఇంకెవరైనా సహకరిస్తున్నారా.. అన్నదానిపై క్షేత్రంలో చర్చ జరుగుతోంది. అలాగే సురేష్ గతంలో రెండు చెవి దిద్దెలను ఓ వ్యక్తికి ఇచ్చినట్టు చెబుతున్నాడని సమాచారం. అందులో వాస్తవం ఎంతా అనే దా నిపై విచారణ జరుపుతున్నారట.
భద్రతలో డొల్లతనం
నిందితుడు సురేష్‌కు సంబంధించిన వివరాలేమీ దేవస్థానం రికార్డుల్లో లేవని తెలుస్తోంది. పట్టుబడ్డ తరువాతే అతడి వివరాలు బయటకొచ్చాయని పలువురు అంటున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సేవకుల నుంచి ఆధార్ కార్డులు, వారి ఫొటోలు, సేవా సంఘం హెడ్ సిఫార్సు లేఖను అధికారులు తీసుకోవాలి. అయితే ఈ నిబంధనలేవీ ఇక్కడ పాటించలేదని తెలుస్తోంది. అలాగే పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో ఇక్కడ చోరీ సులువుగా జరిగిందని స్థానికులు, భక్తులు అంటున్నారు.
హోం గార్డులను మార్చాలని..
హుండీల నగదు లెక్కింపులో పాల్గొనే వారిని హోంగార్డులు తనిఖీ చేస్తున్నారు. అయితే చోరీ ఘటన తర్వాత వారిని మార్చాలని దేవస్థానం అధికారులు పోలీస్ ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది. హుండీల నగదు లెక్కింపునకు కానిస్టేబుళ్లను నియమించాలని భక్తులు సూచిస్తున్నారు.


