భద్రతా సిబ్బందిని మార్చాలి
అనుమానంతోనే..
సీసీ కెమెరాల పర్యవేక్షణలో..
● ఓ సేవకుడు నిఘాపెట్టి పట్టిస్తేనే గాని.. పట్టుకోలేని వైనం
● మెటల్ డిటెక్టర్లు, స్కానర్ల జాడ లేదు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి హుండీల నగదు లెక్కింపులో భద్రతా వైఫల్యాలపై భక్తులు మండిపడుతున్నారు. అత్యాధునిక స్కానర్లు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా.. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది, సేవకులను చేతులతో తడుముతూ తనిఖీలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బందిని మార్చకుండా.. ఏళ్ల తరబడి వారితోనే తనిఖీలు చేయించడం సరికాదని అంటున్నారు. చిన్నవెంకన్న ఆలయంలో ప్రతి 15–20 రోజుల మధ్యలో హుండీల నగదు లెక్కింపును స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. మొత్తం 150 మంది వరకు పాల్గొంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన సేవకులు 100 మంది వరకు హాజరవుతారు. లుంగీ, బనియన్, లేదా కండువా ధరించిన వారిని మాత్రమే లెక్కింపులోకి అనుమతిస్తారు. ఒంటిపై ఎలాంటి బంగారం, వెండి ఆభరణాలు ఉండకూడదు. అధికారులు మినహా ఎవరూ సెల్‌ఫోన్లు లోపలికి తీసుకెళ్లకూడదు. లెక్కింపులో పాల్గొనే వారందరినీ కల్యాణ మండపం ముఖ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది చేతులతో తడుముతూ తనిఖీలు చేస్తారు.
తడిమినా దొరకలేదు
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం, సూరంపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బొల్లా సురేష్ ఐదేళ్ల క్రితం నుంచి ప్రతిసారీ జరిగే హుండీల నగదు లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం లెక్కింపులో పాల్గొన్న సురేష్ హుండీల్లోని నగదు, కానుకలను మెషిన్‌పై జల్లిస్తుండగా చేతివాటాన్ని ప్రదర్శించాడు. మరో సేవకుడు పమ్మి వెంకటేశ్వరరావు అతడి కదలికలపై నిఘా పెట్టాడు. వెంకటేశ్వరరావు ఆలయ అధికారుల వద్దకు వెళ్లి, సురేష్ బంగారం పట్టుకుని వెళిపోతున్నాడని చెప్పాడు. దాంతో అధికారులు, సెక్యురిటీ సిబ్బంది సమీపంలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సురేష్‌ను అదుపులోకి తీసుకుని, తనిఖీలు చేశారు. కమోడ్‌లోని ప్రెస్ ట్యాంక్‌లో దాచిపెట్టిన బంగారు వస్తువులు, డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు సీఐ పి.కృష్ణ ఘటనా స్థలాన్ని, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆలయ ఈఓ వై.భద్రాజీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ ఇక్కడ చోరీ చేయడం ఇదే మొదటి సారా.. లేక గతంలో ఏమైనా చేశాడా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఘటన జరిగిన తరువాత కౌంటింగ్ హాల్లోకి, బయటకు వెళ్లే ప్రతి ఒక్కరినీ అండర్‌వేర్ తీయించి మరీ భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ఇకపై ఇలానే తనిఖీలు జరుగుతాయని అంటున్నారు.
మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు ఎక్కడ?
తిరుమల తిరుపతిలో ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది మెషిన్‌లతో స్కాన్ చేసిన తరువాతే శ్రీవారి హుండీల నగదు లెక్కింపుకు అనుమతిస్తారు. బయటకు వచ్చే సమయంలోనూ స్కాన్ చేస్తారు. అలాంటి మెషిన్‌లు, మెటల్ డిటెక్టర్లను గానీ ఇక్కడ వినియోగించక పోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హుండీల లెక్కింపులో పాల్గొనే భద్రతా సిబ్బంది ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్నారు. దేవస్థానం అధికారుల కనుసన్నల్లోనే వారు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటిది వారు అధికారులను ఎలా తనిఖీలు చేయగలరన్న ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. కొన్ని అవకతవకలకు ఇవి కూడా ఒక కారణం కావొచ్చని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రతి హుండీ లెక్కింపునకు భద్రతా సిబ్బందిని మార్చాలని, ఒకరికొకరు సంబంధం లేని పోలీసులను నియమించి, తనిఖీలు ముమ్మరం చేసి భక్తుల కానుకలను రక్షించాలని స్థానికులు, పలువురు భక్తులు కోరుతున్నారు.
ఇటీవల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన హుండీల నగదు లెక్కింపులో పాల్గొన్న బొల్లా సురేష్ చేతివాటం ప్రదర్శించినట్టు నాకు అనుమానం కలిగింది. అప్పటి నుంచి అతడి కదలికలను గమనిస్తున్నాను. ఇక్కడ సురేష్ బంగారం అండర్‌వేర్‌లో వేసుకుని బయటకు వెళ్తూ.. వాటిని లోపలికి నెట్టేశాడు. అందువల్లే భద్రతా సిబ్బంది తడిమినా దొరకలేదు. దీన్ని గమనించిన నేను వెంటనే విషయాన్ని అధికారులకు చెప్పి, సురేష్‌ను పట్టించాను. సేవ పేరుతో ఇలాంటివి చేయడం సరికాదు.
– పమ్మి వెంకటేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, మొసలపల్లి గ్రామం
శ్రీవారి హుండీల నగదు లెక్కింపును సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయ అధికారులు సైతం ఈ లెక్కింపును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లి వచ్చే ప్రతీ ఒక్కరినీ భద్రతా సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నాం. స్కానర్లు ఏర్పాటు చేయిస్తాం.
– యర్రంశెట్టి భద్రాజీ,
ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ


